🔳జనవరిలో కొత్త డీఎస్సీ
డిసెంబరు వరకు ఉన్న ఖాళీల భర్తీకి నోటిఫికేషన్
ఏప్రిల్, మే నెలల్లో రాత పరీక్షలు
స్కూళ్లు తెరిచేలోగా నియామకాలు
ఇకపై ఏటా ఇదే పద్ధతి.. సర్కారు నిర్ణయం
పరిశీలనలో విద్యార్థులు, టీచర్ల నిష్పత్తి
అమరావతి, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): నిరుద్యోగులకు శుభవార్త. జనవరిలో కొత్త డీఎస్సీ-2020 నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ ఏడాది డిసెంబరు 31నాటికి ఉన్న ఉపాధ్యాయ ఖాళీలను దానిద్వారా భర్తీ చేయనున్నారు. వచ్చే ఏప్రిల్, మే నెలల్లో రాత పరీక్షలు నిర్వహిస్తారు. జూన్‌లో పాఠశాలలు ప్రారంభమయ్యేలోగా కొత్తగా ఎంపికైన టీచర్లకు నియామక ఉత్తర్వులు అందిస్తారు. ఇకపై ప్రతి సంవత్సరం ఇదే పద్ధతిలో ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలని రాష్ట్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏటా జనవరిలో నోటిఫికేషన్ ఇచ్చి వేసవి సెలవుల్లోగా టీచర్ల నియామకాలు పూర్తిచేస్తే విద్యార్థులకు మెరుగైన బోధన లభిస్తుందని, దీనిద్వారా సర్కారీ స్కూళ్లలో అడ్మిషన్లు పెరుగుతాయని భావిస్తున్నారు. అలాగే విద్యార్థులు, టీచర్ల నిష్పత్తి పాటించే అంశాన్ని కూడా సర్కారు పరిశీలిస్తున్నట్లు సమాచారం. విద్యాహక్కు చట్టం ప్రకారం.. ప్రాథమిక పాఠశాలల్లో ప్రతి 30మందికి ఒకరు, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల్లో ప్రతి 35మంది విద్యార్థులకు ఒకరు చొప్పున టీచర్ ఉండాలి. అయితే పాఠశాలల్లో ఉండే తరగతులు, సెక్షన్లను బట్టి అదనపు టీచర్ల అవసరం ఉంటుంది. విద్యార్థుల సంఖ్యకు తగినట్టుగా ఉపాధ్యాయులను ఉంచడానికి కసరత్తు చేస్తున్నామని పాఠశాల అధికారులు చెబుతుండగా.. విద్యాశాఖపై తాజాగా జరిగిన సమీక్ష సందర్భంగా ఉపాధ్యాయ ఖాళీల భర్తీ ప్రక్రియను ఏటా జనవరి నుంచి ప్రారంభించాలని సీఎం జగన్ ఆదేశించారు. డీఎస్సీ-2018 నోటిఫికేషన్ జారీచేసే నాటికి రాష్ట్రంలోని ప్రభుత్వ, జిల్లాపరిషత్ పాఠశాలల్లో దాదాపు 20వేల వరకు ఉపాధ్యాయ ఖాళీలున్నాయి. అప్పట్లో ప్రభుత్వం సుమారు 6వేల పోస్టులనే నోటిఫై చేయగా, దాదాపు 14వేల ఖాళీలు ఉన్నాయి. అప్పటినుంచి ఈ ఏడాది డిసెంబరు వరకు రిటైర్మెంట్లు, పదోన్నతులు తదితర కారణాలతో ఈ సంఖ్య 25వేల వరకు పెరుగుతుందని అధికారిక లెక్కలే చెబుతున్నాయి.
ఇదిలాఉండగా, ఈ నెలాఖరులో రాష్ట్రంలోని ప్రభుత్వ, జిల్లాపరిషత్, మోడల్ స్కూళ్లకు సుమారు 3వేల మంది కొత్త టీచర్లు రానున్నారు. డీఎస్సీ-2018 నోటిఫికేషన్ ద్వారా 7,902 పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వం భావించినా విద్యార్హతలు, సర్వీసు పరమైన అంశాలకు సంబంధించి న్యాయపరమైన సమస్యలు ప్రతిబంధకంగా మారాయి. ఒకవైపు కోర్టు ఆదేశాలు, మరోవైపు నిరుద్యోగుల నుంచి వస్తున్న ఒత్తిళ్ల నేపథ్యంలో వివాదాల్లేని పోస్టులను తొలివిడతలో భర్తీ చేసేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే దాదాపు 1,900మంది అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయింది. సదరు జాబితాలోని కొందరని వేర్వేరు కారణాలతో తిరస్కరించారు. వారిస్థానంలో ప్రొవిజినల్ మెరిట్ లిస్టులో ఉన్న తదుపరి అభ్యర్థులను వెరిఫికేషన్‌కు ఆహ్వానిస్తున్నారు.