Ticker

6/recent/ticker-posts

꧁🌱*విమర్శ ఎలా ఉండాలి?*🌱꧂

꧁🌱*విమర్శ ఎలా ఉండాలి?*🌱꧂  

‘ప్రపంచంలో సలహాలివ్వడం కంటే విమర్శించడం చాలా తేలిక’ అన్నాడో ఫ్రెంచ్‌కవి. సలహా ఇవ్వాలంటే ఎదుట ఓ మనిషి ఉండాలి. విమర్శించడానికి ఎదుట ఎవరూ ఉండనక్కర్లేదు. నేటి సమాజంలో సమయం, సందర్భం లేకుండా, విమర్శలు విపరీతమైపోయాయి.
ఒక కావ్యాన్నో కవితనో లేదా ఏదైనా ప్రణాళికనో అంశాన్నో విశ్లేషించేవారికి- ఆ కవి లేదా ఆవిష్కర్తకన్నా ఎక్కువ విషయ పరిజ్ఞానం ఉండాలి.తార్కికంగా, నిష్పాక్షికంగా, అర్థవంతంగా చేసే విమర్శలు మనోవికాసానికి, ప్రావీణ్యాన్ని మరింత మెరుగుపరచుకోవడానికి ఉపయోగపడతాయి. విమర్శ మంచి గంధంలా పరిమళించాలి. మలయ మారుతంలా మనసును తాకాలి. విన్నవారి హృదయాలు నొచ్చుకోకుండా, వారి ఆలోచనా సరళిని ప్రభావితం చేయాలి.


వ్యక్తిని చూడకుండా, మిత్రుడా, శత్రువా అన్న ఆలోచనతో నిమిత్తంలేకుండా కేవలం అతడి సృజనాత్మకతను మంచిని మంచిగా, చెడును చెడుగా విడమరచి చేసే విమర్శ- సద్విమర్శ. ఈ సద్విమర్శ ఉభయులకు (రచయితకు, విమర్శకుడికి) ఎంతో శ్రేయస్కరం.


రామాయణ, భారత, భాగవతాది గ్రంథాల్లో మనకు విమర్శలు కోకొల్లలుగా కనబడతాయి. తన బోధలను, హితవును లక్ష్యపెట్టక పుత్రవ్యామోహమనే హాలాహల సాగరంలో మునిగిపోయిన ధృత రాష్ట్రుణ్ని అనేక సందర్భాల్లో విమర్శించాడు విదురుడు. మరిగే నీటిలో మన ప్రతిబింబం కనపడనట్లే- అతివ్యామోహంలోనూ అత్యంత ఆగ్రహంతోనూ రగిలి పోయేవాడికి విమర్శలు, హితబోధలు చెవికెక్కవు. మిడిమిడి జ్ఞానం కలవాళ్లు, సహనం లేనివాళ్లు, విచక్షణ తెలియనివాళ్లు- తమ దోషాలను ఇతరులు ఎత్తి చూపినప్పుడు అసలు సహించరు. 


తాము పట్టిన కుందేటికి మూడే కాళ్లు అన్న మొండివాదనకు సిద్ధపడతారు. రాజసూయయాగం చేయాలని ధర్మజుడు తలపెట్టి, కృష్ణుణ్ని అగ్రపూజకు ఆహ్వానించిన తరుణంలో, శిశుపాలుడు అజ్ఞానంతో, అహంకారంతో వాసుదేవుణ్ని అనేక విధాలుగా దూషిస్తూ కువిమర్శ చేసి, చివరకు ప్రాణాలు కోల్పోతాడు. రావణుడు తన అకృత్యాలను విమర్శించిన మండోదరిని, విభీషణుణ్ని లెక్కచేయడు. సత్యభామ పలుమార్లు సవతులను నిందించి, విమర్శించి, తగిన దుష్ఫలితం పొందింది.విమర్శ గురించి విశ్లేషిస్తూ స్వామి వివేకానంద ‘మనల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆశయాన్నీ స్వీకరించాలి. బలహీనపరచే ప్రతి ఆలోచననూ తిరస్కరించాలి’ అంటారు.
విమర్శలను సహృదయతతో, వినమ్రతతో స్వీకరించడమే సంస్కారం. ప్రతి రచయితలోనూ ఓ విమర్శకుడూ ఉండి తీరాలన్నది అనుభవజ్ఞుల మాట.రచయితలు ఏది రాసినా ఆత్మ పరిశోధన చేసుకోవాలి. స్వయం విమర్శ చేసుకోవాలి. విమర్శకులపైన వ్యక్తిగతమైన విరోధం పెట్టుకుని ఎదురు దాడికి దిగడం శ్రేయస్కరం కాదు.
‘వినడానికి కటువుగా ఉన్నా, మీ గురించి వాస్తవాలు చెప్పేవారి సలహాలు తీసుకోండి’ అనేవారు ‘భారతరత్న’ మోక్షగుండం విశ్వేశ్వరయ్య. విమర్శలకు గురైనప్పుడు కుంగిపోకూడదు. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి.అదేపనిగా ఇతరులలోని ప్రతి అంశాన్నీ, ప్రతి లోపాన్నీ ఎత్తి చూపడమే వృత్తిగా పెట్టుకునేవాడు తననుతాను ఉద్ధరించుకోలేడు. పొరపాట్లను ఎత్తి చూపేవారు సరిదిద్దే సూచనలు కూడా ఇవ్వడం సమంజసం. నిరాధారమైన విమర్శకు, నిర్మాణాత్మకమైన విమర్శకు మధ్యగల భేదాన్ని గుర్తించడం అవసరం. ఆ పరిజ్ఞానమే వ్యక్తి అభ్యున్నతికి శ్రీరామరక్ష.