Ticker

6/recent/ticker-posts

*శ్రీకాకుళం చరిత్ర*



సుదీర్ఘ సముద్రతీరం.. అపారమైన ప్రకృతి వనరులు... కోట్ల రూపాయల విలువైన గ్రానైట్‌ సంపద.. క్రీస్తుపూర్వం నాటి ఘనమైన చరిత్ర.. అతి ప్రాచీన... అత్యంత అరుదైన దేవాలయాలు... బౌద్ధారామక్షేత్రాలు.. ఇదీ శ్రీకాకుళం జిల్లా స్వరూపం.
ఇదో అందమైన వూటీ... పేదల వూటీ... వేసవిలోనూ చల్లదనం చూపించే జిల్లా ఇది. వంశధార, నాగావళి, మహేంద్రతనయ, బహుదా నదుల సాగర సంగమ ప్రదేశాలు మనసును పరవశింపచేస్తాయి. మరో కోనసీమను తలపించే ఉద్దానం.. నిజంగా స్వర్గధామమే. శాలిహుండం, కళింగపట్నం, దంతవరపు కోట ఆనాటి కళింగ ప్రజల శాంతికాముకత్వానికి ప్రతీకలుగా నిలిచాయి. శ్రీకాకుళం పట్టణానికి ఆనుకుని ఉన్న సూర్యదేవాలయం, శ్రీకూర్మంలోని శ్రీకూర్మనాథుడి ఆలయం, దక్షిణకాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీముఖలింగేశ్వర, మధుకేశ్వర దేవాలయాలు, ఒకనాడు పాండవులు నివసించిన తూర్పు కనుమల్లోనే ఎత్త్తెన శిఖరాలుగా పేరుగాంచిన మహేంద్రగిరులు... విదేశీ విహంగాలకు ఆటపట్టయిన తేలినీలాపురం, తేలుకుంచి, ప్రాచీన కాలంలో ఓడరేవులుగా విలసిల్లిన కళింగపట్నం, బారువలు శ్రీకాకుళం జిల్లాలోని విభిన్న కోణాలను స్పృశిస్తాయి.
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లా ఉత్తరంగా తూర్పుతీరాన ఉంది. ఉత్తర అక్షాంశం 18-20 డిగ్రీల నుంచి దక్షిణ అక్షాంశం 84-50 డిగ్రీల వరకు వ్యాపించి... తూర్పున బంగాళాఖాతం, పశ్చిమ, ఉత్తర దిశల్లో ఒడిశా.. ఈశాన్యంగా విజయనగరం జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి.
జిల్లా విస్తీర్ణం 5837 చదరపు కిలోమీటర్లు. 1991 జనాభా లెక్కల ప్రకారం జిల్లా జనాభా 23.17 లక్షలు. 2001 లెక్కల ప్రకారం 25.37 లక్షలు. 2011 జనాభా లెక్కల ప్రకారం 26.99 లక్షలు.
జిల్లా సరాసరి గరిష్ఠ ఉష్ణోగ్రత 87.3 డిగ్రీల ఫారన్‌హీట్‌. కనిష్ఠ ఉష్ణోగ్రత 73.9 ఫారన్‌హీట్‌. సమతల శీతోష్ణస్థితి.
శతాబ్దాల చరిత-చిక్కోలు ఘనత
ప్రాచీనకాలంలోనే శ్రీకాకుళం ఉందనడానికి ఎన్నో ఆధారాలున్నాయి. అయితే 1950లో జిల్లాలు ఏర్పడనంత వరకు ఈ ప్రాంతాన్ని కళింగ ప్రాంతంగా వ్యవహరించేవారు.
కళింగ చరిత్ర ఐతరేయ బ్రాహ్మణం, రామాయణం, మహాభారతం, కథా సరిత్సాగరం, మొదలైన గ్రంథాలలో ప్రస్తావించారు. పూర్వదశలోనే ఈ ప్రాంతంలో ఆదిమ తెగలతో కూడుకున్న జనజీవనం ఉన్నట్టుగా కంభంపాటి సత్యనారాయణ ఆంధ్రుల సంస్కృతి-చరిత్రలో పేర్కొన్నారు. శబ్దకల్ప ద్రుమంలో కలి+గయ్‌+డ అని కళింగ ఉత్పత్తి పేర్కొన్నారు. వివాదాలు జరిగే ప్రదేశాలు కనుక దీనికి 'కళింగ' ప్రదేశమని వచ్చిందని కళింగ చరిత్రలో వివరించారు.
'రామాయణం'లో అయోధ్యకాండలో భరతుడు కేకేయరాజును వదిలి అయోధ్యకు వచ్చేటప్పుడు కళింగనగరం మీదుగా ప్రయాణించాడని చెప్పినట్టు ప్రాచీన చరిత్ర-భూగోళంలో పేర్కొన్నారు. ఈ ప్రాంతానికి సంబంధించి అయోధ్యకు పశ్చిమంగా కళింగనగరం ఉన్నట్టు రామాయణం ద్వారా తెలుస్తోంది. భారతంలో కూడా అర్జునుడు తీర్థయాత్రలకు వెళ్లే సమయంలో భ్రాతృభిస్సహితో వీరఃకలింగాన్‌ ప్రతిభావతి అని చెప్పిన దాని ప్రకారం అప్పటికే ఈ కళింగ ప్రాంతం ఉన్నట్టు తెలుస్తోంది. దీర్ఘతమనుడు అనే రుషిని కాళ్ళు, చేతులు కట్టి అతని శిష్యులు గంగలో వదిలివేశారు. అతడు నీటిలో కొట్టుకురాగా 'బిలి' అనే రాజు అతనిని ఇంటికి తీసుకెళ్లి సంరక్షణ చేసి తన భార్యతో సంతానాన్ని కనాలని కోరడంతో ఆ రుషి ఆమె ద్వారా 'అంగుడు', 'వంగడు' 'కళింగుడు', 'సహ్ముడు' అనే పుత్రులను కన్నాడని ఆ పుత్రుల వల్ల వారి పేర్ల మీదుగా రాజ్యాలు ఏర్పడ్డాయని మహాభారతంలో ఉంది.
దండి రాసిన దశకుమార చరిత్రలో కళింగ దేశం, కళింగనగరం పేర్కొనబడ్డాయి. మార్కండేయ పురాణం, వాయు పురాణం, కాళిదాసు రఘువంశంలో కూడా 'కళింగం' ఉనికిని ప్రస్తావించారు. మన్మోహన్‌ గంగూలీ 'ఒరిస్సా దాని చిహ్నములు' అనే గ్రంథంలో కాళింగమునకు ఉత్తరమున వైతరణి నది, దక్షిణాన గోదావరి, తూర్పున సముద్రం, పశ్రిమాన ఒరిస్సా రాష్ట్రాలున్నాయని చెప్పడాన్ని బట్టి చూస్తే ఈ కళింగం అతి ప్రాచీనమైనదని చెప్పవచ్చు. కళింగ ప్రాంతాన్ని గురించి శ్రీముఖలింగంలో లభించిన శాసనాలు, శక్తివర్మ రాగోలు శాసనాలలో మనకు మరింత సమాచారం దొరుకుతుంది.
ఈ శాసనాల పరంగా పరికిస్తే జిల్లా అతిప్రాచీనమైనదని అర్థమవుతుంది. ఈ ప్రాంతంలో క్రీ.పూ. నాల్గవ శతాబ్దం నాటికే కళింగ రాజ్యం కటక్‌ నుంచి పిఠాపురం వరకు వ్యాపించి ఉంది. అప్పటి నుంచి 15వ శతాబ్దం వరకు అనేక మంది రాజులు, దండయాత్రలు జరిపి తమ తమ రాజ్యాలను స్థాపించారు. మహ్మదీయ పాలనలో కూడా తెలుగు భాషకు ప్రాధాన్యం ఇచ్చారు. కాలానుగుణంగా కళింగ రాజ్యం ఉత్తర భాగం ఒరిస్సాలోను, దక్షిణభాగం ఆంధ్రలోను అంతర్భాగం అయ్యాయి. క్రీ.పూ. 467 నుంచి 336 వరకు మౌర్యులు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. కళింగ దేశంపై దాడి చేసిన అశోకుడు క్రీ.పూ. 225లో పశ్చాత్తాపం పొంది బౌద్ధమతాన్ని ఈ ప్రాంతంలోనే స్వీకరించాడు. గంగరాజుల పాలనలో బౌద్ధ, జైన మతాల ప్రాబల్యం ఎక్కువగా ఉండేది. జిల్లాలో ఈ మతాలకు చెందిన చారిత్రక ప్రదేశాలు శాలిహుండం, కళింగపట్నం, మహేంద్రగిరి, దంతవరపుకోట, సంగమయ్యకొండ మొదలైన ప్రదేశాలున్నాయి.
మౌర్య సామ్రాజ్యం పతనమైన తర్వాత క్రీ.శ. 183లో భారవేలుడు ముఖలింగం రాజధానిగా కళింగ రాజ్యాన్ని స్థాపించాడు. 7వ శతాబ్దం వచ్చినంత వరకు కళింగ రాజధాని ముఖలింగంగానే పరిగణింపబడింది. భారవేలుని తరువాత ఆంధ్ర చక్రవర్తులైన శాతవాహనులు, కళింగదేశాన్ని జయించారు. శాతవాహనుల తరువాత కళింగ రాజ్యం విచ్ఛిన్నమై చిన్న చిన్న రాజ్యాలుగా మారాయి. క్రీ.శ. 343లో సముద్రగుప్తుడు దండెత్తి వచ్చిన కాలంలో కళింగదేశాన్ని నలుగురు రాజులు పరిపాలిస్తున్నారు. నాటి వాసిష్ఠులకు రాజధాని పిఠాపురమే.
శాలంకాయనుల ధాటికి తాళలేక శ్రీకాకుళం దగ్గర ఉన్న 'సింగుపురానికి' ఆ తర్వాత టెక్కలి వద్ద ఉన్న 'వర్దమానపురానికి' అక్కడ నుంచి పొందూరు వద్ద నున్న 'సిరిపురానికి' రాజధానులను మార్చుకున్నారు. క్రీ.శ. 485లో విష్ణుకుండినులు దక్షిణ కళింగాన్ని జయించారు. క్రీ.శ. 497లో గంగ వంశం వారు శ్రీకాకుళం స్టేషన్‌కు సమీపంలో ఉన్న మునగాలవలస పక్కన ఉన్న 'పురుషోత్తపురం' దగ్గరున్న దంతపురాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించారు. అప్పటినుంచి క్రీ.శ. 1434లో ప్రతాపరుద్ర గజపతి పరిపాలనకు వచ్చినంత వరకు గంగరాజులే పరిపాలించారు.
గౌతమి బుద్ధుడు క్రీ.పూ. 483లో మరణించిన తర్వాత అంత్యక్రియలు జరిపించి ఆయన శరీర అవశేషాలను వివిధ ప్రాంతాలకు తీసుకుపోయారు. బుద్ధుని నోటిలోని ఒక దంతాన్ని ఖేమరుసి అనే వ్యక్తి తీసుకువచ్చి కళింగరాజుల్లో ఒకడైన బ్రహ్మదత్తుని కాలంలో నరేంద్రపురం కోటలో పదిలపర్చాడు. క్రమంగా ఇక్కడ ఒక స్థూపం కూడా నిర్మితమై ఎన్నో పూజలందుకుంది. ఇదే కాలక్రమంలో దంతకోట, దంతపురంగా మారిందని చెబుతారు.
గంగరాజులు కళింగాన్ని సుదీర్ఘమైన కాలం పరిపాలించారు. ఒక దశాబ్దం వరకు 'ముఖలింగం' రాజధానిగా చేసుకుని పరిపాలించిన తర్వాత కటకానికి రాజధానిని మార్చారు. వీరి హయాంలో శ్రీముఖలింగం, నగరికటకం అద్భుత నగరాలుగా ఉండేవి. శ్రీముఖలింగ ఆలయాలు వీరు నిర్మించినవే. ఆనాటి సామాజిక జీవన స్థితిగతులు ముఖలింగం శిల్పాల్లో కనిపిస్తాయి. గంగ వంశానికి చెందిన 50 మంది రాజులు పరిపాలించినట్టు చరిత్రకారులు గుర్తించారు. వీరి శాసనాలు జర్జంగి, శ్రీకాకుళం, ఉర్లాం, అచ్యుతాపురం, సంతబొమ్మాళి, ఆమదాలవలస తదితర ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి. ముఖలింగం ఆలయంలోనే 149 శాసనాలున్నాయి. గంగరాజుల్లో ఒకడైన రెండవ వజ్రహస్త దేవుని శిల్పం ఇక్కడ కనిపిస్తుంది. ఈ వంశంలో చివరివాడు భానుదేవుడు.

గంగ వంశ పతనంతో ఆంధ్రదేశం మూడుభాగాలుగా విడిపోయింది. ఉత్తర కళింగాన్ని, క్రీ.శ. 1344లో పాలించిన కపిలేశ్వర గజపతికి 'కటకం' రాజధానిగా మారింది. అతని కుమారుడు పురుషోత్తమ గజపతి కళింగాన్ని జయించాడు. ఉత్తర కళింగమ్‌ 'ఉత్కళం'గా మారిందని భాషాశాస్త్రవేత్తలు అంటారు. ఇతని కుమారుడు ప్రతాపరుద్రుని కాలంలో శ్రీకృష్ణ దేవరాయులు దండయాత్ర చేసి కళింగ సామ్రాజ్యం హస్తగతం చేసుకున్నాడు. నేటి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు ఆ 'నందపురం'లోనే ఉండేవి. పర్లాకిమిడి రాజులు ఈ కాలంలో శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి, మందస, నరసన్నపేట ప్రాంతాలను ఆక్రమించారు. జలంతరకోట, ఇచ్ఛాపురం, సోంపేట ప్రాంతాలు పాత్రునుల ఆధీనంలో ఉండిపోగా శ్రీకాకుళం, బొంతలకోడూరు ప్రాంతం మహ్మదీయ ప్రాబల్యంలోకి వెళ్లిపోయాయి.
నందవంశంలో క్రీ.శ.1752-58 కాలంలో లాలాకృష్ణుడు, విక్రమ్‌దేవ్‌ల మధ్యన పోరు జరిగి రాజ్యం విచ్ఛిన్నమైంది. నేటి ఒరిస్సా, విజయనగరం జిల్లాలోని కొన్ని ప్రాంతాలు 'జామీలు'గా ఏర్పడ్డాయి. పాలకొండ, వీరఘట్టాం కొత్త రాజ్యాలుగా అవతరించాయి. ఈ విభేదాలను ఆసరాగా చేసుకొని విజయనగరరాజు విజయరామరాజు విక్రమదేవునికి అండగా నిలిచి సాలూరు, కురుపాం, తదితర రాజ్యాలు పొందినట్లుగా చరిత్ర ద్వారా తెలుస్తోంది.
ఔరంగజేబు గోల్కొండ నవాబును ఓడించి, నిజాం ఉల్‌ముల్క్‌ని తన ప్రతినిధిగా నియమించగా, ఔరంగజేబు మరణానంతరం నిజాం స్వతంత్రత ప్రకటించుకున్నాడు. అతని పరిపాలనలోనే ఆంధ్రప్రాంతం అయిదు సర్కారులుగా ముక్కలైంది. నిజాం రాజు మరణానంతరం వారసత్వం కోసం చెలరేగిన అంతఃకలహాల్లో సలాబత్‌సింగ్‌ ఫ్రెంచ్‌ సేనాని బుస్సీ సహాయాన్ని కోరాడు. దీనితో శ్రీకాకుళం సర్కార్‌ నుంచి కొండపల్లి సర్కార్‌ వరకు నాలుగు సర్కారులను ఫ్రెంచివారు తమ సైనిక ఖర్చుల కింద రాయించుకున్నారు. దీనివలన నైజాం ప్రతినిధి అయిన జార్‌ అలీ మహారాష్ట్రుల సహాయం కోరాడు. మహారాష్ట్ర సైనికులు చికాకోల్‌, విశాఖ, గోదావరి ప్రాంతాలను వశం చేసుకున్నారు. వారు వెళ్లిన తరువాత నిస్సహాయుడైన జాఫర్‌ అలీ మరణించాడు.క్రీ.శ. 1754లో చికాకోల్‌ 'సుబా' ఫ్రెంచివారి ఆధీనమైంది. విజయరామరాజు కోసం బొబ్బిలినిక్రీ.శ. 1757 జనవరి 26న ఫ్రెంచి సేనలు చుట్టుముట్టాయి. ఇతని హత్య తర్వాత రాజైన ఆనందగజపతి ఇంగ్లిషు వారితో చేతులు కలిపాడు. క్రీ.శ.1758లో ఇంగ్లిషు సైన్యం వచ్చింది. క్రీ.శ.1759లో 'చికాకోల్‌'లో 'ఫౌజ్‌దార్‌'ల పాలన అంతమైంది. క్రీ.శ.1760లో ఆనందగజపతి చనిపోగా 1766లో ఈస్టిండియా పాలన ప్రారంభమైంది. అప్పటికి పాలకొండ, టెక్కలి మొదలైన జమిందారీలు ఉన్నాయి. 1778లో బ్రిటిష్‌వారితో జమిందారులు చేసుకున్న ఒప్పందం ప్రకారం క్రీ.శ.1801 నుంచి కలెక్టర్ల నియామకం ప్రారంభమైంది. 1816 నుంచి జిల్లా కలెక్టర్‌కు మెజిస్ట్రేట్‌ అధికారాలు లభించాయి. జమీందారీ విధానాన్ని ఎదిరించిన గంజాం, విశాఖ జిల్లాల రైతుల వల్ల 'అచ్చపువలస' దగ్గర గిరిజన పితూరీ జరిగింది. ఈ గ్రామం వీరఘట్టాం దగ్గర ఉంది.క్రీ.శ. 1834లో గిరిజన తెగలకు చెందిన పాలకొండ, మేరంగి, కురుపాం, మొండెంఖల్‌లలో జమీందార్ల దోపిడీ ఎక్కువైంది. బ్రిటిష్‌వారు శ్రీకాకుళం, కశింకోటలను విశాఖలో విలీనం చేశారు. ఇచ్ఛాపురాన్ని పాతగంజాంలో 1902లో కలిపారు.క్రీ.శ. 1902-1930 మధ్యలో జమీందారులు విపరీతంగా శిస్తులను పెంచారు. జమిందార్ల వ్యతిరేక పోరాటానికి 1940లో పలాసలో జరిగిన అఖిల భారత రైతు మహాసభ స్ఫూర్తినిచ్చింది. మందసలో జరిగిన రైతాంగ పోరాటంలో శానుమాను గున్నమ్మ వీరమరణం పొందింది.

క్రీ.శ.1948లో జమిందారీలను రద్దు చేసిన తర్వాత ఇచ్ఛాపురం, పార్వతీపురం, విజయనగరం సంస్థానాలన్నీ కలిపి విశాఖపట్నం అతిపెద్ద జిల్లాగా ఏర్పడింది. విశాఖ జిల్లా పెద్దదవడంతో పరిపాలనా పరమైన చిక్కులు ఏర్పడ్డాయి. దానితో 1950 ఆగస్టు 15న శ్రీకాకుళం రైల్వేస్టేషన్‌లో అర్ధరాత్రి జరిగిన సమావేశంలో శ్రీకాకుళం షేక్‌అహ్మద్‌ కలెక్టర్‌గా నియమితులవడంతో కొత్త జిల్లాగా రూపుదిద్దుకుంది.
ఇతర విశేషాలు....
జిల్లా ప్రధాన కేంద్రమైన శ్రీకాకుళం పట్టణం చెన్నై - కోల్‌కతా జాతీయ రహదారిపై విశాఖపట్టణానికి వంద కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీకాకుళానికి చేరువలోనున్న విమానాశ్రయం విశాఖపట్నం. సమీపంలోని రైల్వేస్టేషన్‌ ఆమదాలవలస స్టేషన్‌. ఇది శ్రీకాకుళం పట్టణానికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉంది.
శ్రీకాకుళం పట్టణంలో ప్రాచీన ఆలయాల్లో శ్రీ ఉమారుద్ర కోటేశ్వరాలయం ఒకటి. ఏకాంత గణపతి పర్వతాకారులైన నందీశ్వరునితో అలరారుతోంది. ఈ ఆలయంలో 16, 17 శతాబ్దాల శాసనాలు లభించాయి. శ్రీకోదండరామస్వామి ఆలయం, జిల్లాలో అతిపెద్దదైన జుమ్మామసీదు ప్రత్యేకంగా పేర్కొనవచ్చు.
మహాత్ముడు నడిచిన నేల
 





రవి అస్తమించని బ్రిటిష్‌ సామాజ్య్రంపై అహింసే ఆయుధంగా ఎదురొడ్డి పోరాడిన భరతమాత ముద్దుబిడ్డ, స్వాతంత్య్ర ప్రదాత మహాత్మాగాంధీ మూడు రోజుల పాటు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. స్వాతంత్య్ర పోరాటం కీలక దశకు చేరుకున్న కాలంలోనే పోరాటం తీరుతెన్నులు తెలుసుకొనేందుకు గాంధీ శ్రీకాకుళంలో పర్యటించారు. క్రీ.శ.1927 డిసెంబరు 2 నుంచి మూడు రోజుల పాటు ఇక్కడ గడిపారు. పర్యటన తొలిరోజు పాలకొండ రోడ్డులోని ఎంబాడ హనుమంతరావు ఇంటిలో బస చేశారు. ప్రస్తుతం ఈ ఇంటిని గాంధీజీ బస చేసిన చిహ్నంగానే ఉంచేశారు. ఇక్కడ గాంధీ ఉద్యమ సహచరులతో చర్చించడం, పోరాటంలో పాల్గొంటున్న నాయకులు, యువకుల గురించి ఆరా తీయటం చేశారు. శ్రీకాకుళం జిల్లాలో ఖాదీ పరిశ్రమ అభివృద్ధి తీరుతెన్నులు కూడా అడిగి తెలుసుకొన్నారు. ఇక్కడ నేసిన ఖద్దరు పరిశీలించి నేత కార్మికులను ప్రశంసించారు. అదే రోజు స్థానిక పురపాలక సంఘం మైదానంలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. దేశ సార్వభౌమాధికారం కోసం జరుగుతున్న పోరాటాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లడానికి వీలుగా భూరి విరాళాలు ఇవ్వాలని గాంధీజీ ఇచ్చిన పిలుపునకు అన్ని వర్గాల వారు పెద్దఎత్తున స్పందించారు. ప్రజాస్పందన గమనించిన గాంధీజి వారిని అభినందించారు.
కలం వీరుల కన్నభూమి
శ్రీకాకుళం జిల్లా ఎందరో విరామమెరుగని కలం వీరులకు జన్మనిచ్చి పునీతమైంది. ఉత్తర విశాఖ జిల్లా ఆవిర్భావానికి ముందు, తరువాత ఎందరెందరో పాత్రికేయులు జాతీయస్థాయిలో శ్రీకాకుళం జిల్లా కీర్తిపతాకాన్ని ఎగురవేశారు. శాశ్వత కీర్తితోరణాలై గర్వకారణంగా నిలిచారు. ఈ జిల్లాలో నాగావళి ప్రాంతంలో జన్మించిన ఆచంట వెంకట సౌఖ్యాయన శర్మ తెలుగు పత్రికా రంగానికి శ్రీకారం చుట్టారు. ఆయనక్రీ.శ. క్రీ.శ.1881లో 'సుజాత ప్రమోదిని' అనే పత్రికను క్రీ.శ.1903లో 'కల్పలత' అనే పత్రికను నెలకొల్పారు. ఆ కాలంలో ఈయన తన పత్రికల్లో విభిన్నంగా విజ్ఞానశాస్త్రం, రసాయనశాస్త్రం, భూ, వృక్ష, ఖనిజ తత్వాలకు సంబంధించిన వైజ్ఞానిక అంశాలను ప్రచురించేవారు. ఆచంట సౌఖ్యయన శర్మ పార్వతీపురం మునిసిఫ్‌ కోర్టులో న్యాయవాదిగా, చినమోరంగి సంస్థానం దివానుగా కొన్నాళ్ళు పనిచేశారు. సి.వై.చింతామణిగా భారత పత్రికారంగంలో సుప్రసిద్ధుడైన చిర్రాపూరి యజ్ఞేశ్వర చింతామణి 1900 లో విజయనగరం నుంచి వెలువడే తెలుగు హార్స్‌ అనే పత్రికను నిర్వహించారు. క్రీ.శ.1904లో రాజమండ్రి నుంచి వెలువడిన 'ఆంధ్రకేసరి' పత్రికా సంపాదకులు డాక్టర్‌ చిలకూరి నారాయణరావు శ్రీకాకుళం జిల్లా వారే.క్రీ.శ. 1980లో పొందూరు సమీపంలోని ఆనందపురంలో పుట్టిన ఈయన శ్రీకాకుళం, పర్లాకిమిడి, విజయనగరంలలో చదువుకున్నారు. భాష పరిశోధనలో ఆయన స్పృశించని అంశం లేదు. ఆయన రాసిన గ్రంథాలు 240 కాగా వాటి పేజీల సంఖ్య లక్షా 20 వేలు. వ్యవహార భాషోద్యమ పిడుగు గిడుగు వెంకట రామమూర్తి ఈ జిల్లాలోని పర్వతాలపేట ఆగ్రహారానికి చెందిన వారే. ఆయన 'తెలుగు' పత్రికను ఏడాది పాటే నడిపినా దానిని వ్యవహారిక భాషోద్యమ దీపికగా మలిచారు. వ్యవహార భాషకు పట్టం గట్టడమే కాకుండా సవరభాషకు లిపిని, నిఘంటువును, వ్యాకరణాన్ని రూపొందించి బాషావేత్తగా, శ్రీముఖలింగం ఆలయ శాసనాలను వెలుగులోకి తెచ్చిన శాసన పరిశోధకునిగా రామ్మూర్తి పంతులు చరితార్ధుడు. ఆయన కుమారుడు గిడుగు సీతాపతి కూడా తండ్రి అడుగుజాడల్లోని నడిచి క్రీ.శ.1940లో భారతి పత్రికను సంపాదకునిగా పనిచేశారు. తన హయాంలో బాలసాహిత్యానికి, సవర పాటల తెలుగు అనువాదాలకు 'భారతి'లో స్థానం కల్పించారు. ఆధునిక జర్నలిజానికి బాటలు వేసిన తాపీ ధర్మారావు స్వస్థలం బరంపురం. ఈయన బరంపురం నుంచే 'కాగడా', 'ప్రజామిత్ర' పత్రికకు సంపాదక బాధ్యతలు నిర్వహించారు. తెలుగు పత్రికా రంగంలోనే సుప్రసిద్ధుడే కాక తెలుగు సంస్కృతీ వికాసానికి ప్రమాణిక గ్రంథాలు రాసిన వ్యక్తిగా చిరస్మరణీయుడు. 1923లో నరసన్నపేటకు చెందిన పొట్నూరు స్వామిబాబు కళింగవైశ్యుల్లో ఉన్న మూఢాచారాల నిర్మూలనకు 'వైశ్య' అనే పత్రికను నడిపారు. ఇచ్ఛాపురానికి చెందిన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు పుల్లెపు శ్యామసుందరరావు, ప్రజావాణి పత్రికను నడిపారు. బరంపురంలో జన్మించిన న్యాపతి నారాయణమూర్తి ఆంధ్రవాణి కళింగ పత్రికలకు సంపాదకత్వం వహించారు. భారతి పత్రికలలోనూ క్రీ.శ.1936లో మద్రాపు వచ్చి వాహిని పత్రికలో బాధ్యతలు నిర్వహించారు. ఆంధ్రప్రభ పత్రికకు ఆయన తొలి సంపాదకుడు. చివరి రోజుల్లో విజయప్రభ పత్రికను, జైభారత్‌ పత్రికను నిర్వహించారు.

మాకొద్దీ తెల్లదొరతనం అన్న స్వతంత్య్ర సమరయోధుడు, సాహితీ ఉద్యమకర్త గరిమెళ్ళ సత్యనారాయణ కూడా ఈ జిల్లావాసే. క్రీ.శ.1893లో పోలాకి మండలం ప్రియాగ్రహారంలో జన్మించారు. గాంధీజీ పిలుపుతో జాతీయోద్యమంలో పాల్గొని 162 పదాలతో మాకొద్దీ తెల్లదొర తనం అనే పాటను రాశారు. ఈయన క్రీ.శ.1993లో 'గృహలక్ష్మి' పత్రిక సంపాదకునిగా ఆచార్య రంగా ఆధ్వర్యంలోని 'వాహిని' పత్రికకు సహాయ సంపాదకునిగా, ఆంధ్రవాణి పత్రికకు కొన్నేళ్ళు సంపాదకునిగా బాధ్యతలు వహించారు.
తాండ్ర శౌర్యం నిండిన రాజాం

శ్రీకాకుళం జిల్లా చరిత్రలో తాండ్ర పాపారాయుడు పేరు ప్రస్తావించాల్సిందే. తాండ్ర పాపయ్య కోట రాజాంలో ఉండేది. విజయరామరాజు బొబ్బిలి కోటను ధ్వంసం చేసి స్వాధీనం చేసుకోవడంతో కోటలోని అంతఃపుర స్త్రీలు అగ్నిలో దూకి ఆత్మహుతి చేసుకున్నారని చారిత్రక ఆధారాలు తెలుపుతున్నాయి. ఆత్మహత్య చేసుకున్న బొబ్బిలి రాణి తాండ్ర పాపారాయుడికి స్వయానా సోదరి. బొబ్బిలి పతనం తెలుసుకున్న తాండ్ర పాపయ్య రాజాం నుంచి హుటాహుటిన బొబ్బిలి వెళ్లి అక్కడ విజయరామరాజును చంపడం కూడా చారిత్రక ప్రసిద్ధమే. బొబ్బిలిపులి తాండ్ర పాపారాయుడు నివసించిన వీరగెడ్డ రాజాం ప్రాంతంలో రాజుల తీపిగురుతులు నేటికీ ఉన్నాయి.
'కోట'లో కోర్టు
నాడు తాండ్ర పాపారాయుడు కొలువున్న రాజాంలోని కోటలో ఇటీవల కాలం వరకు జూనియర్‌, సీనియర్‌ న్యాయస్థానాలు నిర్వహించేవారు. నేటికీ కోర్టులో దసరా ఉత్సవాలను చేయడం ఆనవాయితీగా వస్తోంది. తాండ్ర కొలువున్న రోజుల్లో కోటను కాపాడే శక్తిని కోటదుర్గ అనేవారని, ఈ కోటలో భేతాళుడు ఉన్నాడని పెద్దలు చెప్పేవారు. ఇప్పటికీ కోటకు వెళ్లే మార్గంలో రెండువైపులా రెండు ఫిరంగుల గొట్టాలున్నాయి. కోటచుట్టూ పెద్ద కందకం ఉండేదని వృద్ధులు చెబుతారు. ప్రస్తుతం బస్టాండ్‌గా వినియోగిస్తున్న మల్లమ్మచెరువును ఆనుకుని ఉన్న గుర్రమ్మచెరువులో గుర్రాలు నీళ్లు తాగేవని చారిత్రక ఆధారాలున్నాయి. కోట నుంచి చిన్నచెరువు వరకు సొరంగమార్గం ఉండేదని, ఆ మార్గంపైనే నేడు మాధవబజార్‌ రహదారి నిర్మితమైందని ప్రచారం ఉంది. కోటలోని స్త్రీలు సొరంగమార్గం ద్వారా చిన్నచెరువులోకి వెళ్లి స్నానాలు చేసేవారని వృద్ధతరం చెబుతుంటుంది.

ఠాణాలో తహశీల్దారు కార్యాలయం
తాండ్ర పాపారాయుడు రాజాంలో ఉన్నకాలంలో ఠాణా నిర్వహించిన భవనంలో ప్రస్తుతం తహశీల్దారు కార్యాలయాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో ఆనాటి జైలుగదిలో ప్రస్తుతం రికార్డులు భద్రపరుస్తున్నారు. తాండ్రపాపారాయుడు మెడలో ధరించే గొలుసు తహశీల్దారు కార్యాలయంలో ఇప్పటికీ భద్రంగానే ఉంది.
ఏకాంత సీతారామాలయం
బొబ్బిలిరాజులు ఈ ప్రాంతానికి వచ్చినపుడు దైవదర్శనం చేసుకునేందుకు వీలుగా సంతకవిటి మండలం గుళ్లసీతారాంపురంలో ఏకాంత సీతారామాలయాన్ని నిర్మించారు. ధనుస్సు, విల్లంబులు లేకుండా ఏకశిలపై సీతారామలక్ష్మణులున్న ఏకైక ఆలయం ఇదే. ఈ ఆలయ నిర్వహణ కోసం వందలాది ఎకరాల భూములను బొబ్బిలి రాజులు సమకూర్చారు. ఆ భూములన్నీ ఇపుడు అన్యాక్రాంతమయ్యాయి.
ఇవన్నీ గురుతులే..
ప్రస్తుతం జి.సి. క్లబ్‌గా ఉన్న భవనం బొబ్బిలి రాజులు సమకూర్చినదే. ప్రస్తుతం సామాజిక ఆస్పత్రి నిర్మించిన ప్రాంతంలో తాండ్ర హయాంలో గుర్రాలు, ఏనుగుల స్థావరంగా ఉండేది. బొబ్బిలి రాజులు ఈ ప్రాంతంలో ఎస్టేట్లను చూసేందుకు వచ్చినపుడు విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా ఉంగరాడ, జి.ఎస్‌.పురం గ్రామాల్లో విశ్రాంతి భవనాలు నిర్మించారు. పాపారాయుడు లేకపోవడం వల్ల బొబ్బిలి పాడైందని చరిత్ర చెబుతుండగా, ఆయన స్థావరంగా ఉన్న రాజాం చరిత్రపుటలకెక్కింది.

తరతరాల సంస్కృతికి ప్రతీక పొందూరు సన్నఖాదీ

ఖాదీని గంగా నదిగా భావిస్తే పొందూరు ఖాదీని గంగా నదికి జన్మనిచ్చిన గంగోత్రిగా అభివర్ణించొచ్చు అని గాంధీ మనుమరాలు తారా గాంధీ అభివర్ణించారు.
స్వాతంత్య్ర సంగ్రామంలో ఉప్పు, చరఖా, ఖాదీ తెల్లవారి గుండెల్లో దడ పుట్టించాయి. గాంధీజీ పిలుపు మేరకు విదేశీ వస్తు బహిష్కరణ, వస్త్ర దహనంలో ఉద్యమం పతాక స్థాయికి చేరుకొని ఖాదీ స్వదేశీ ఉద్యమంగా రూపుదిద్దుకొంది. ఆంధ్ర ప్రాంతంలో అప్పటికే బాగా వాడుకలో ఉన్న సన్ననూలు వస్త్రాలు క్రీ.శ.1921లో గాంధీజీ దృష్టికి వచ్చాయి. అవి నిజంగా చేతి వడుకు నూలుతో నేసిన వస్త్రాలేనా? అని గాంధీజీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వెంటనే ఆయన ఆ వడుకు, నేత విధానాలను పరిశీలించి నివేదికను సమర్పించాలని తన కుమారుడు దేవదాసు గాంధీని పురమాయించారు. దేవదాసుగాంధీ పొందూరు, అంపోలు, బొంతలకోడూరు తదితర ప్రాంతాల్లోని సన్ననూలు వడుకు, నేత విధానాలు స్వయంగా పరిశీలించి, తండ్రికి వివరించారు. ఈ విషయాన్ని బాపూజీ అప్పట్లో 'యంగ్‌ఇండియా' పత్రికలో ప్రకటించారు. అప్పటి నుంచి శ్రీకాకుళం జిల్లా సన్ననూలు వస్త్రాలకు, పొందూరు ఖాదీ వస్త్రాలకు అఖిల భారత స్థాయిలో ఎనలేని ప్రచారం, ఆదరణ లభించాయి. చేతితో వడికిన నూలుతో చేమగ్గం మీద నేసిన వస్త్రాన్ని ఖద్దరుగా పేర్కొంటారు. నాట్యం అనగానే కూచిపూడి ఎలా గుర్తుకు వస్తుందో, పొందూరు మాట వినగానే స్ఫురించేది ఖాదీయే. దేశవ్యాప్తంగా రెండు వేల ఖాదీ సంస్థలు ఉన్నప్పటికీ చుక్కల్లో చంద్రునిలా పొందూరు ఖాదీ నిలుస్తోంది.
సంఘటిత రంగంలోకి--
కొన్ని వందల ఏళ్లపాటు పొందూరు ఖాదీ అసంఘటిత రంగంలో ఉండేది. క్రీ.శ.1949లో సంఘటిత రంగంలోకి అడుగిడింది. అదే ఏడాది ఏప్రిల్‌ 1న ఆంధ్ర సన్నఖాదీ కార్మికాభివృద్ధి సంఘంగా అవతరించింది. క్రీ.శ. 1955 అక్టోబరు 13న ఈ సంఘం భవనానికి సర్వోదయ నాయకుడు ఆచార్య వినోబాభావే శంకుస్థాపన చేశారు. దేశంలో అత్యున్నత ప్రమాణాలు గల సన్నఖాదీ (100వ కౌంటు) కేవలం శ్రీకాకుళం జిల్లాలో మాత్రమే తయారు కావడం విశేషం. ఖాదీ ఉత్పత్తి వ్యవస్థను శాస్త్రీయ దృక్పథంతో పరిశీలించి, దానికి సాంకేతిక ప్రమాణాలను నిర్ణయించి క్రమబద్ధం చేసిన మనీషి మల్లెమడుగుల కోదండరామస్వామి.
కొండపత్తితో
దేశం మొత్తంమీద కేవలం శ్రీకాకుళం జిల్లాలో మాత్రమే కొండపత్తిని ఉపయోగించి ఖాదీ వస్త్రాలను తయారు చేస్తున్నారు. పొందూరు సన్నఖాదీని రూపొందించడానికి ముఖ్యంగా కావలసింది ఓ చేపముల్లు అంటే ఆశ్యర్యం కలుగుతుంది. ఖాదీ తయారీకి ముఖ్యమైన కొండపత్తిలోని ఆకుపొల్లును తొలగించి దానిని ధగధగ మెరిసేలా చేసేదిఈ ముల్లే. వాలుగు చేప దవడ కింది, మీది భాగాలను శభ్రపరిచి ఎండలో ఆరబెట్టి నాలుగు ముక్కలుగా కోస్తారు. తరువాత ముక్కలను పెన్సిల్‌ సైజు కర్రలకు కట్టి దాని సహాయంతో గింజలో ఉన్న ముడి పత్తిని శుభ్రం చేస్తారు.
విస్తరిస్తున్న పొందూరు ఖాదీ
పొందూరు ఖాదీ సంస్థ పరిధిలోని 40 గ్రామాల్లోని వెయ్యిమంది వడుకు పని మహిళలు ఈ చేపముల్లును వాడుతున్నారు. బాణం వంటి సాధనంతో పత్తిని ఏకి, ఏకులుగా చేసి రాట్నంపై సన్నటి నూలు తీస్తారు. ఇక సన్నఖాదీ పాట్నూలు, చీరల నేత పరిశ్రమ ఇక్కడి పట్టుశాలిపేట, వాండ్రంగి వీధిలో విజయవంతంగా కొనసాగుతోంది. పాలకొండ, సంతకవిటి, చాటాయవలసల్లో న్యూ మోడల్‌ చరఖా ఉత్పత్తి కేంద్రాలు పనిచేస్తున్నాయి. 100 మంది నేత పనివారు పరిశ్రమను నమ్ముకొని జీవనం సాగిస్తున్నారు.
పర్యాటక కేంద్రంగా
ఎంతో ప్రాముఖ్యాన్ని పొందిన ఈ పరిశ్రమ కీర్తి కిరణాలు విదేశాల్లోనూ ప్రసరిస్తున్నాయి. కెనడా, అమెరికా, జర్మనీ, డెన్మార్క్‌, నార్వే, స్వీడన్‌, జపాన్‌ తదితర దేశాల నుంచి పర్యాటక బృందాలు ఇక్కడి ఖాదీ పరిశ్రమను సందర్శించి ప్రశంసల వర్షాన్ని కురిపిస్తున్నాయి. అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌ హైదరాబాదు వచ్చినపుడు రాష్ట్ర ప్రభుత్వం పొందూరు ఖాదీ వస్త్రాలను అందజేసింది. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాటజీ (చెన్నై, హైదరాబాదు) పరిశోధన విభాగం విద్యార్థులు స్థానిక ఖాదీ సంస్థను సందర్శించి ఖాదీనేత కార్మికుల హస్తకళా నైపుణ్యాన్ని పరిశీలించి తన్మయులయ్యారు. ఢక్కా, మజ్లిన్‌ వస్త్రాలతో పొందూరు ఖాదీని సరిపోల్చవచ్చని జాగృతి (ముంబై) పత్రిక ప్రశంసించింది.

ఖాదీ కార్యాలయాన్ని సందర్శించిన ఆచార్య వినోబాభావే 
ముచ్చటగొలిపే ఎ.ఎన్‌.ఆర్‌. అంచుపంచెలు---పొందూరు ఖాదీలో ఎ.ఎన్‌.ఆర్‌ అంచు పంచెలకు మంచి గిరాకీ ఉంది. సినీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు ఈ పంచెలను తరచూ తెప్పించుకుంటారు. ఈ పంచెల అంచులను సహస్రావధాని మాడుగుల నాగఫణిశర్మ హంసలతో పోల్చారు. ఈ మేరకు ఖాదీ కార్యాలయం సందర్శకుల పుస్తకంలో ఓ మంచి కవితనూ రాశారు.
ఎన్నో వస్త్ర ప్రదర్శనల్లో క్రీ.శ.1972లో న్యూఢిల్లీలో ఆసియా 72 ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన హస్తకళా ప్రదర్శనలో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ స్వయంగా పాల్గొని పొందూరు ఖాదీ ఉత్పత్తులను తిలకించి పులకించిపోయారు. గాంధీ మనుమరాలు తారాగాంధీ రెండుసార్లు ఇక్కడి పరిశ్రమను సందర్శించారు. ఈ సందర్భంగా ఖాదీ కార్మికుల సంక్షేమం కోసం రూ.30,000 ఆర్థిక సాయాన్ని అందించారు. ఖాదీ ఒక వస్త్రం మాత్రమే కాదని, నిజాయితీకి సూచిక, సంకేతంగా నిలుస్తుందని అన్నారు. తన పొందూరు సందర్శన తిరుపతిని సందర్శించినంతటి ఆనందాన్ని కల్గించిందని పేర్కొన్నారు.
ఏటా రూ. కోటి విలువచేసే వస్త్రాల ఉత్పత్తి
ఏటా రూ. కోటి విలువ చేసే వస్త్రాలను పొందూరు ఖాదీ సంస్థ ఉత్పత్తి చేస్తోంది. పాట్నూలు పంచెలు, జరీ కుప్పడం చీరలు చాలా ప్రసిద్ధి కెక్కాయి. షర్టింగులకూ గిరాకీ ఉంది. ఖాదీకి సమాంతరంగా ఉత్పత్తి అవుతున్న నకిలీ ఖాదీ ఈ పరిశ్రమను దెబ్బతీస్తోంది.

ఉద్యమాల గడ్డ శ్రీకాకుళం
దేశంలో శ్రీకాకుళం జిల్లాకు ప్రత్యేక స్థానముంది. నేటి విప్లవ పార్టీలకు శ్రీకాకుళం జిల్లాతో ఎనలేని సంబంధముంది. దేశచరిత్రలోనే శ్రీకాకుళోద్యమం కీలకమైనది. 1967లో భూస్వాముల పెత్తనానికి వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభమైంది. సీపీఐ (ఎంఎల్‌) ఉమ్మడి పార్టీగా ఉన్నప్పుడు పార్వతీపురం ప్రాంతానికి చెందిన మేడిద సత్యం అనే భూస్యామికి వ్యతిరేకంగా గిరిజనులు పోరాటానికి దిగారు. వారికి ఎంఎల్‌ పార్టీ అండగా నిలిచింది. జిల్లాకు చెందిన ఉద్యమకారులంతా గిరిజనులకు బాసటగా నిలిచారు. దీంతో విజయనగరం మొండెంకెలు ప్రాంతంలోవెంపటాపు సత్యం, ఆదిభట్ల కైలాసం వంటి నాయకుల సారథ్యంలో గిరిజన మహాసభ నిర్వహించారు. ఆ సభకు వెళ్లివస్తుండగా జరిగిన పోలీసు కాల్పుల్లో పార్టీకి చెందిన కోరన్న, మంగన్నలు మృతి చెందారు. దీంతో ఉద్యమం తీవ్రరూపం దాల్సింది. అప్పుడే నక్సల్‌బరీ ఉద్యమం మొదలయ్యింది. 1968 నవంబర్‌ 25న తామాడ గణపతిని ఎన్‌కౌంటర్‌ చేయగా నవంబర్‌ 25ను సాయుధ దినంగా ప్రకటించారు. తదనంతరం 1969 నవంబర్‌ 25న వజ్రపుకొత్తూరు మండలం గరుడబద్రకు చెందిన భూస్యామి మద్ది కామేశ్‌కు చెందిన భూముల్లో ఉద్దానం ప్రాంతానికి చెందిన కూలీలు వరిపంటను స్వాధీనం చేసుకున్నారు. దీంతో సుమారు 2000 మందిని అరెస్టు చేసి సెంట్రల్‌ జైల్లో పెట్టారు. అప్పట్లో బొడ్డపాడు ప్రాంతానికి చెందిన పురుషులంతా జైల్లో ఉండటంతో ఎవరు చనిపోయినా ఆగ్రామ మహిళలే దహన సంస్కరణలు చేసేవారు. సోంపేట ప్రాంతంలో జరిగిన కేంద్రకమిటీ సమావేశానికి వెళ్లి వస్తుండగా రంగమటియా ప్రాంతంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఉద్యమానికి కీలక నేతలైన పంచాది కృష్ణమూర్తితోపాటు మరో ఆరుగురు మృతి చెందారు. పార్వతీపురం, పాతపట్నం, సారవకోట, సాలూరు, సోంపేట, పలాస, మందస వంటి ప్రాంతాల్లో ఉద్యమం తీవ్రతరం దాల్చింది. దీంతో వరుసగా జరిగిన పోలీసు కాల్పులు సందర్భంగా వెంపటాపు సత్యం, ఆదిభట్ల కైలాసం, సుబ్బారావు పాణిగ్రాహి వంటి అగ్రనాయకులు ప్రాణాలు కోల్పోయారు. శ్రీకాకుళం నక్సల్‌బరీ ఉద్యమంలో సుమారు 400 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. తదనంతరం మావోయిస్ట్‌ పార్టీలో గత 20 ఏళ్లలో సుమారు 80 మంది వరకు మృతి చెందారు. ప్రస్తుతం ఉద్దాన ప్రాంతానికి చెందిన వారు ఎనిమిది మంది వరకు అజ్ఞాత జీవితం గడుపుతున్నారు.

థర్మల్‌ పోరాటాలు...


సోంపేట బీలలో నాగార్జున నిర్మాణ సంస్థ థర్మల్‌ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా అక్కడి ప్రజలు రెండున్నరేళ్లుగా ఉద్యమిస్తున్నారు. ఇది 2010 జులై 14న పోలీసు కాల్పులకు దారితీసింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు చనిపోగా... వందలాదిమంది గాయపడ్డారు. 2011 ఫిబ్రవరిలో సంతబొమ్మాళి మండలం కాకరాపల్లి తంపర భూముల్లో ఈస్ట్‌కోస్ట్‌ ఎనర్జీ సంస్థ నిర్మించనున్న థర్మల్‌ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పోరాడుతున్న జనంపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ దుర్ఘటనలో ఇద్దరు చనిపోయారు.
వీరఘట్టం నుంచి విశ్వాంతరాలకు..
కోడి రామ్మూర్తి నాయుడు
 
అరవై ఏళ్ల క్రితం.. అది బెనారస్‌ విశ్వవిద్యాలయం తొలి వైస్‌ఛాన్సలర్‌ పండిట్‌ మదనమోహన మాలవీయ షష్టిపూర్తి ఉత్సవవేదిక. ఆ వేదిక ముందు మహాత్మగాంధీ, జవహర్‌లాల్‌నెహ్రూతో పాటు జాతి రత్నాలనదగిన నాయకులు.. మహారాజులు.. జమీందార్లు... గవర్నర్లు.. విద్యావేత్తలు.. ఎందరెందరో ప్రముఖులు.. ఆ వేదికపై ఉన్నది ముగ్గురే. ఒకరు మాలవీయ, మరొకరు కోడి రామ్మూర్తినాయుడు, ఇంకొకరు బెనారస్‌ యూనివర్శిటీ హిందీ ప్రొఫెసర్‌. మాలవీయ ఏడాదిపాటు కోడి రామ్మూర్తినాయుడిని అతిథిగా ఆదరించి ఆ విశ్వవిద్యాలయ వ్యాయామ శిక్షణ బృందానికి సలహాదారుగా నియమించారు. తన షష్టిపూర్తి ఉత్సవంలో రామ్మూర్తినాయుడిని ఎంతో ఘనంగా సత్కరించారు. ఎక్కడ వీరఘట్టం! ఎక్కడ బెనారస్‌!! ఎక్కడ నాగావళి! ఎక్కడ గంగ!! రామ్మూర్తి నాయుడికి ఒక్క బెనారస్‌లోనే కాదు పంచమజార్జ్‌ చక్రవర్తి చేతుల మీదుగా అప్పటి మద్రాసులో 'ఇండియన్‌ శాండో' బిరుదు, బంగారు పతకాల కోటు, నవరత్న ఖచిత బంగారు కంకణం ప్రదానం చేశారు. లండన్‌లోనూ జార్జి సత్కరించారు. రంగూన్‌లో పౌరసన్మానం అందుకున్నారు. వ్యాయామశాస్త్ర ఆచార్య బిరుదు పొందారు. స్పెయిన్‌, రోమ్‌, చైనా దేశాల్లో సన్మానాలు.. కలకత్తా, కటక్‌, మైసూర్‌, బొంబాయి పట్టణాల్లో సత్కారాలు.. కలియుగ భీముడు, జగదేకమల్లుడు, ఇండియన్‌ హెర్క్యులస్‌, మల్ల మహామార్తాండ... ఇలా ఎన్నో బిరుదులు, ఎన్నెన్నో బంగారుపతకాలు, భారతదేశ పౌరుషానికి, సాహసానికి మూడుదశాబ్దాలపాటు ఏకైక ప్రతినిధి కోడి రామ్మూర్తినాయుడు.
వీరఘట్టాం రాతిచెరువు గట్టు నుంచి విజయనగరం అయ్యకోనేరు.. ఆ ఊరు తాలింఖానా నుంచి మహారాజాకళాశాల.. అక్కడి నుంచి మదరాస్‌ సయ్యద్‌ వ్యాయామ శిక్షణ కళాశాలల్లో శిక్షణ. స్వయంకృషితో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే ప్రతిభను ప్రదర్శించారు రామ్మూర్తినాయుడు. సాముగరిడీలు, కుస్తీల వంటి స్వదేశీ మెలకువల నుంచి పేర్లర్‌బార్‌, హారిజాంటల్‌బార్‌, రోమన్‌రాగ్స్‌ వంటి విదేశీ మెలకువలనూ నేర్చుకున్నా, ఆయన్ని మహాబలుడిని చేసింది మాత్రం భారతీయ యోగశాస్త్రం. ప్రాణాయామం, జల, వాయుస్థంభన విద్యలను శారీరక బలప్రదర్శనలకు జోడించడం వల్లనే ఆయన జగదేక మల్లుడయ్యారు. 'రామ్మూర్తినాయుడు సర్కస్‌ కంపెనీ' సర్కస్‌ కంపెనీ దేశవిదేశాలు పర్యటించి చరిత్ర సృష్టించింది. ఉక్కు గొలుసులను శరీరానికి చుట్టుకొని, ఊపిరి బిగించి వాటిని పటపటా తెంచడం, బంపర్లు పట్టుకొని రెండు చేతులతో రెండుకార్లను నిలిపివేయడం, పెద్దబండరాతిని ఛాతీపై ఉంచుకొని, సమ్మెటలతో ముక్కలు చేయించుకోవడం, ప్రదర్శన చివరి అంశంగా నేలపై పడుకొని, ఛాతిపై చెక్క బల్లను వేయించి, ఏనుగును అయిదు నిమిషాలు నిలబెట్టుకోవడం... రామ్మూర్తినాయుడు సాహస ప్రదర్శనల్లో ఇవి ప్రధానమైనవి.
ఆయన శక్తి, కీర్తి కొందరికి అసూయ కలిగించడంతో కొన్ని హత్యాప్రయత్నాలు కూడా జరిగాయి. లండన్‌లో ఏనుగు ఫీట్‌ చేస్తున్నప్పుడు ఒక ద్రోహి బలహీనమైన చెక్కను ఛాతిపై పెట్టాడు. ఏనుగు ఎక్కగానే, చెక్క విరిగి ఆయన పక్కటెముకల్లోకి దిగబడింది. శస్త్రచికిత్స చేయించుకొని రెండు నెలలపాటు ఆయన లండన్‌లోనే ఉండిపోవాల్సి వచ్చింది. మరోసారి రంగూన్‌లో హత్యాప్రయత్నం చేసిన వ్యక్తులను చితకబాది, సురక్షితంగా బయటపడ్డారు. మాల్కానగరంలో భారతంలో భీముడి మాదిరిగా విషప్రయోగాన్ని కూడా ఎదుర్కొన్నారు. ఒక విందులో విషం కలిపిన పాలు తాగారు. అప్పుడు ఆయన్ని కాపాడింది యోగ విద్యే. విషాన్ని జీర్ణించుకొని మూత్రం ద్వారా విసర్జించారు. ప్రపంచంలో ఎందరో మల్లయోధులు ఆయనతో తలపడాలని తపన పడేవారు. ఆయన చేతిలో ఓటమిని గౌరవంగా భావించేవారు. కొందరు అహంకారంతో పోటీకి సవాలు చేస్తే, తన శిష్యులతోనే వారిని ఓడించారు రామ్మూర్తినాయుడు. ఆయన శిష్యుల్లో గొప్ప వస్తాదులుండేవారు. ప్రపంచంలో గొప్ప మల్లయోధుడిగా పేరొందిన 'గామా' ఓసారి రామ్మూర్తినాయుడుతో పోటీకి వచ్చాడు. రామ్మూర్తినాయుడు తన రోజువారి ప్రాక్టీసులో భాగంగా గునపాలతో జడలు అల్లడం, పెద్ద ఇనుప గుండును కాళ్లతో ఆడటం చేసేవారు. ఆయన శిష్యులు 'గామా'కు వాటిని చూపించారు. గునపాల జడలను సరిచేయలేక, ఇనుపగుండును రెండు చేతులతో ఎత్తలేక, 'గామా' చివరకు కుస్తీపోటీల్లోనూ రామ్మూర్తినాయుడి శిష్యుల చేతిలో చిత్తుగా ఓడిపోయాడు. ఈ తరువాత సిగ్గుపడి, ఆయన శిష్యుడిగామారిపోయాడు.
రామ్మూర్తినాయుడిని జమీందార్లు, బ్రిటీష్‌ అధికారులు ఎక్కువగా ఆదరించారు. విజయనగరం జమిందార్‌ అలకనంద గజపతి ప్రోత్సాహంతో ప్రారంభమైన ఆయన వైభవం, బొలంగీర్‌ జమిందార్‌స్థానంలో కన్నుమూసే సరికి పూర్తిగా అంతరించింది. ఓ మాటలో చెప్పాలంటే, మల్లవిద్యలో ప్రపంచాన్నే జయించిన ఈ జగదేక మల్లుడు జీవిత చరమాంకం చేతిలో చిత్తుగా ఓడిపోయాడు. కాలిపై పుట్టిన చిన్న కురుపు పెద్ద పుండుగా మారి చివరకు పిక్కల వరకు కాలును తొలగించాల్సి వచ్చింది. బొంబాయి ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేస్తున్నప్పుడు మత్తుమందు కూడా తీసుకోకుండా, ప్రాణాయామంతోనే ఆ బాధను మరిచిపోయారు. అప్పటి నుంచి ఆయన కష్టాలు మొదలయ్యాయి. సంపాదన దాన, ధర్మాలకు పోగా మిగిలిన ఆస్తులను వారసులమంటూ కొందరు పట్టుకుపోయారు. జార్జి చక్రవర్తి ఇచ్చిన బంగారు పతకం మద్రాసులో ఉండిపోయింది. ఆయన కాలును తీసేసిన తరువాత చివరిసారిగా వీరఘట్టం వచ్చి మిత్రులను చూసి వెళ్లారు. ఒకనాటి మిత్రులైన జమీందార్లను కలుసుకున్నారు. ఆయన కలిసిన చివరి జమీందార్‌ ఒరిస్సాలోని బొలంగీర్‌.
1942 జనవరి భోగి పండుగ.. ఆ రోజు రాత్రి ఆయన వెంట ఉన్నది ఒకే శిష్యుడు.. ఆయన విజయనగరానికి చెందిన కాళ్ల పెదప్పన్న. ఆ రాత్రి కొంచెంసేపు తలపట్టమని శిష్యునికి చెప్పి, తాను లేచేవరకు లేపవద్దని చెప్పి పంపించారు రామ్మూర్తినాయుడు. మరునాడు సంక్రాంతి.. కాని ఆయన నిద్ర లేవలేదు. అదే ఆయన శాశ్వతనిద్ర. సంక్రాంతితోనే జీవితానికి సమాప్తి. కాని ప్రపంచాన్ని జయించిన కీర్తి భారతదేశానికి మిగిల్చిన అమరజీవితమది. బాలగంగాధర్‌ తిలక్‌ చేతులమీదుగా బ్రతికి ఉన్నప్పుడు కర్పూర హారతులు అందుకున్న కోడిరామ్మూర్తినాయుడు మరణానంతరం కూడా మన నీరాజనాలందుకొనే ఉంటారు. బెంగుళూరులో రామ్మూర్తినాయుడు స్ట్రీట్‌, విజయనగరంలో కోడిరామ్మూర్తినాయుడు వ్యాయామశాల, శ్రీకాకుళంలో కోడిరామ్మూర్తినాయుడు స్టేడియం ఇలా కొన్ని ఆయన గుర్తులుగా మిగిలి ఉన్నాయి. 1916లో మైసూరు సంస్కృతి కళాశాల విద్యార్థిగా ఉన్నప్పుడు అబ్బూరి రామకృష్ణారావు, రామ్మూర్తినాయుడి సన్మానసభలో పంచరత్నాలు చదివారు. ఆయన ఓ పద్యంలో.. ''బాహ్యదేహపు చక్రవర్తివి నీవు ఆత్మ ప్రపుల్లత నార్జించినావు అన్ని విధంబులన్‌'' అన్నారు. ఆ పదాల్లోనే రామ్మూర్తినాయుడు దేశానికి మిగిల్చిన కీర్తి కనిపిస్తుంది.
ప్రపంచ క్రీడావనిలో గుబాళించిన తెలుగు 'మల్లి'

అంతర్జాతీయ స్థాయిలో అంతంత మాత్రంగా ఉన్న భారత క్రీడా కౌశలాన్ని, సమున్నతస్థానానికి తీసుకువెళ్లేందుకు ఒక ధ్రువతార వెలిగింది.. ఒక మారుమూల పల్లెలో జన్మించి, తెలుగువారి కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేసేందుకు వెలిగిన ఆ ధ్రువతారే కరణం మల్లీశ్వరి.. మహిళలెవ్వరూ ఆసక్తిచూపని దశలో వెయిట్‌లిఫ్టింగ్‌ క్రీడలో అసమాన ప్రతిభ కనబరిచి, మహిళలు అబలలు కాదు సబలలు అని రుజువు చేయడమే కాకుండా మరెందరో మహిళలకు స్ఫూర్తిగా నిలిచారామె. తండ్రి మనోహర్‌ రైల్వే కానిస్టేబుల్‌. తల్లి శ్యామలాదేవి సాధారణ గృహిణి. చిత్తూరు జిల్లాలోని తవణంపల్లి తాలూకా కట్టకింద పల్లిగ్రామం మల్లీశ్వరి జన్మస్థలం. తండ్రి వృత్తిరీత్యా ఆమదాలవలస రైల్వేస్టేషన్‌కు బదిలీ కావడంతో కుటుంబం ఇక్కడకు వచ్చేసింది. నిద్రాహారాలన్నీ వెయిట్‌లిఫ్టింగ్‌గా భావించి పరిశ్రమించి పైకొచ్చిన జాతీయ వెయిట్‌లిఫ్టింగ్‌ మాజీ కోచ్‌ నీలంశెట్టి అప్పన్న దృష్టిలో తొలుత మల్లీశ్వరి అక్క నరసమ్మ పడింది. చక్కని శరీరదారుఢ్యం కలిగిన నరసమ్మను మంచి వెయిట్‌లిఫ్టింగ్‌ క్రీడాకారిణిగా తయారు చేసేందుకు ఆయన ఎంతగానో కృషిచేశారు. అప్పటి సామాజిక కట్టుబాట్ల కారణంగా మహిళలు వెయిట్‌లిఫ్టింగ్‌ క్రీడలో పాల్గొనడానికి తొలుత మల్లీశ్వరి తల్లిదండ్రులు అంగీకరించలేదు. ఎట్టకేలకు ఊనవానిపేటకు చెందిన నీలంశెట్టి గురివినాయుడు సహాయంతో వారిని ఒప్పించి నరసమ్మకు వెయిట్‌లిఫ్టింగ్‌లో తర్ఫీదునివ్వడం ప్రారంభించారు. వెయిట్‌లిఫ్టింగ్‌ అంటేనే ఒక మోటు క్రీడగా ప్రజలు భావిస్తున్న ఆ రోజుల్లో.. నరసమ్మ పురుషులతో సమానంగా బరువులెత్తి అందరి దృష్టిని ఆకర్షించగలిగారు. 1984లో తొలిసారి జిల్లాస్థాయి పోటీల్లో పాల్గొని ప్రథమస్థానం సాధించిన ఆమెపై యావత్‌జిల్లా ప్రజలు ప్రశంసల జల్లులు కురిపించారు. ఈ సంఘటన మల్లీశ్వరిని వెయిట్‌లిఫ్టింగ్‌ క్రీడపై అభిమానాన్ని కలిగించేలా చేసింది. నీలంశెట్టి అప్పన్న పర్యవేక్షణలో.. అక్క నరసమ్మ చూపిన మార్గంలో.. మల్లీశ్వరి ముందుకు సాగి ఇటు భారతదేశం గర్వపడేస్థాయికి చేరుకున్నారు. సరైన పౌష్టికాహారాన్ని అందించలేని కుటుంబ పరిస్థితులు.. అరకొరగానున్న తుప్పుపట్టిన వెయిట్‌లిఫ్టింగ్‌ పరికరాలు.. ఇవేమీ ఆమె లక్ష్యసాధనకు అడ్డుకాలేకపోయాయి. తొలుత గ్రామస్థాయి పోటీల నుంచి ప్రారంభమైన ఆమె జైత్రయాత్ర నిరాఘాటంగా కొనసాగింది. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయుల్లో ఎన్నో రికార్డులు సాధించిన మల్లీశ్వరి చైనాలోని గ్యాంగ్‌ఝూలో జరిగిన ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్‌ పోటీలలో 54 కిలోల విభాగంలో భారత్‌కు 3 స్వర్ణపతకాలను తెచ్చిపెట్టారు. అటు తర్వాత 1994లో టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో జరిగిన ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌లో తన ప్రత్యర్థి చైనా క్రీడాకారిణి 'డ్రగ్స్‌' తీసుకున్నట్లుగా రుజువు కావడంతో ఆ టైటిల్‌ను మల్లీశ్వరికి ప్రదానం చేశారు. ప్రతిభకు అదృష్టంతో పనిలేదని ఆ తరువాత సంవత్సరమే ఆమె రుజువు చేశారు. 1995లో చైనాలో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో జర్క్‌లో తొలిప్రయత్నంలో 105 కిలోలు, రెండో ప్రయత్నంలో 110 కిలోలు, మూడో ప్రయత్నంలో 113 కిలోలు ఎత్తి చైనా వెయిట్‌లిఫ్టర్‌ లాంగ్‌యాపింగ్‌ పేరిటగల 112.5 కిలోల వరల్డ్‌ రికార్డును బద్దలుకొట్టారు. మరో స్వర్ణం అందుకోవడమే కాకుండా చైనాకు చెందిన జాంగ్‌జుహువా పేరిట ఈ అంశంలో నమోదైన కంబైన్డ్‌ టోటల్‌ రికార్డును సమం చేశారు. ఇస్తాంబుల్‌ వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో 197.5 కిలోల బరువును ఎత్తి ప్రపంచ ఛాంపియన్‌గా వెలుగొందారు. 1997లో చైనాలో జరిగిన ఆసియన్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లోనూ, అదే ఏడాది ఒసాకాలో జరిగిన ఆసియా చాంపియన్‌షిప్‌లను మల్లీశ్వరి కైవసం చేసుకున్నారు. ఇప్పటివరకూ 30 అంతర్జాతీయ పతకాలను సాధించిన మల్లీశ్వరికి 1994లో 'అర్జున అవార్డు', 1997లో దేశంలోనే ప్రతిష్ఠాత్మకమైన 'రాజీవ్‌ ఖేల్‌రత్న' అవార్డులను ప్రభుత్వం అందజేసింది. జాతీయక్రీడల్లో రజతపతకం సాధించిన వెయిట్‌లిఫ్టర్‌ రాజేష్‌త్యాగిని 1996లో వివాహం చేసుకున్నారు.
పోరుదారుల సిక్కోలు 'సర్దారు'

శ్రీకాకుళం అనగానే భారతదేశ రాజకీయాల్లో వెంటనే గుర్తుకువచ్చే పేరు సర్దార్‌ గౌతు లచ్చన్న. అందుకే శ్రీకాకుళానికి లచ్చన్నే గుర్తు. 1947 తరువాత 1983 వరకూ అంటే మూడున్నర దశాబ్దాలు ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్షం ఆయనే. 1909 ఆగస్టు 16న, సోంపేట మండలంలోని బారువలో లచ్చన్న జన్మించారు. నిరుపేద కల్లుగీత కుటుంబానికి చెందిన చిట్టయ్య, రాజమ్మల అష్టమసంతానం ఆయన. బారువలోని 80 సెగిడి (శ్రీశయన) కుటుంబాల్లో చిట్టయ్య 1911 నాటికి ఆర్థికంగా కొంత నిలదొక్కుకొని, 1916లో అక్కడి ప్రాథమిక పాఠశాలలో లచ్చన్నను చేర్చారు. అప్పటికి దేశంలో తెల్లదొరతనానికి వ్యతిరేకంగా జరుగుతున్న జాతీయోద్యమంలో భాగంగా స్వదేశీ ఉద్యమం ఊపందుకుంది. లచ్చన్నలో ఉడుకునెత్తురు తండ్రిని ఆలోచనలో పడేసింది. కొడుకును 1920లో జాతీయవాది కొడిగంటి నర్సింహమూర్తికి అప్పగించాడు. ఈ గురువుగారే చదువుతో పాటు ఆనాటి దేశపరిస్థితులను లచ్చన్నకు బోధించారు. ఆనాటికి గాంధి, నెహ్రు నాయకత్వంలో జాతీయ ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. 1921లో ఆంధ్రరత్న దుగ్గిరాల బలరామకృష్ణయ్యను బరంపురంలో అరెస్టు చేసినపుడు, తోటి బడిపిల్లలతో కలిసి బారువలో రైళ్లు ఆపే కార్యక్రమంలో లచ్చన్న పాల్గొన్నారు. అలా విద్యార్థి దశలోనే ఉద్యమంలో పాలుపంచుకున్నారు.
1926లో శ్రీకాకుళం మున్సిపల్‌ హైస్కూలులో ఫోర్తుఫారంలో చేరారు. 1929లో ఇచ్ఛాపురంలో సిక్త్స్‌ ఫోరం చదువుతూ, నౌపడా ఉప్పుసత్యాగ్రహంలో పాల్గొని అరెస్టయ్యారు. తండ్రికి లచ్చన్నను చదివించాలనే తపన ఉండడం వల్ల తిరిగి 1930లో శ్రీకాకుళం హైస్కూలులో చేర్చారు. శ్రద్ధగా చదివి, సిక్త్స్‌ ఫోరం పాసైన తరువాత మళ్లీ నౌపాడ మందసా జమిందారీ వ్యతిరేక ఉద్యమంతో ఆయన జీవితం విడదీయరానిదిగా మారింది. దాదాపు రెండేళ్లకు పైగా వివిధ జైళ్లలో శిక్షలు అనుభవించారు. కొన్ని నెలలు అజ్ఞాతవాసంలో ఉన్నారు. జాతీయస్థాయి నాయకులతో పరిచయాలు, స్నేహాలు, రాష్ట్రవ్యాప్తంగా అనుచరులను సంపాదించారు. ఇచ్ఛాపురానికి చెందిన పుల్లెల శ్యామసుందరరావు, ఆచార్య ఎన్‌.జి.రంగాలను ఆయన గురుతుల్యులుగా భావిస్తారు. 1946లో ఐఎన్‌టియుసి శాఖను ఆంధ్రలో ప్రారంభించింది లచ్చన్నే. ఆ ఏడాదే విశాఖ షిప్‌యార్డు కార్మికసంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. స్వాతంత్య్రం వస్తే తప్ప వివాహం చేసుకోనన్న ప్రతిజ్ఞ 1948లో నెరవేరింది. యశోదమ్మతో బారువలో వివాహమైంది. ఆ ఏడాదే ఉమ్మడి కాంగ్రెసుకు ప్రత్యామ్నాయ శక్తిగా లచ్చన్న మారారు. కృషికార్‌ లోక్‌పార్టీ, డెమోక్రటిక్‌ పార్టీ, స్వతంత్రపార్టీ, భారతీయ క్రాంతిదళ్‌, జనతాపార్టీ, భారతీయ లోక్‌దళ్‌, ఎ.పి.లోక్‌దళ్‌, జనతాలోక్‌దళ్‌, బహుజన సమాజ్‌పార్టీల వ్యవస్థాపనల్లో, ఆంధ్రరాష్ట్ర నాయకత్వ విషయాల్లో, ఆయా పార్టీ మనుగడలో లచ్చన్నదే కీలకపాత్ర. మహాత్మగాంధీ నుంచి ప్రస్తుత జాతీయనేతల వరకూ ఆయనకు ప్రత్యక్ష సంబంధాలున్నాయి. 1948 జూన్‌లో విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల కార్మిక నియోజకవర్గం నుంచి మొదలు 1978లో సొంపేట నియోజకవర్గం వరకూ శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. 1953లో ప్రప్రథమ రాష్ట్రమంత్రివర్గంలో కార్మికశాఖ, 1955 నుంచి కార్మిక, సాంఘిక సంక్షేమశాఖ, విద్యుత్‌, మైనర్‌పోర్టు, వ్యవసాయశాఖల మంత్రిగా పనిచేశారు. 1983 వరకూ ప్రతిపక్షనాయకుడిగా ఉన్నారు. అనేక పార్టీల్లో, సంస్థల్లో, చట్టసభల్లో ఆయన అలంకరించిన పదవులెన్నో. కేబినేట్‌ మంత్రి హోదా కలిగిన తొలి ప్రతిపక్షనేత ఆయన. ఒకసారి ఎంపిగా గెలిచి తన గురువుగారైన రంగా కోసం రాజీనామా చేసి, గురువునే గెలిపించిన గొప్ప శిష్యుడిగా చరిత్రకెక్కారు.
తెలుగు క్రైస్తవ పదకవితా పితామహుడు పురుషోత్తం చౌదరి
తెలుగు పదకవితా పితామహుడు అన్నమాచార్యుడైతే, తెలుగు క్రైస్తవ పదకవితా పితామహుడు పురుషోత్తమ చౌదరి. తెలుగు క్రైస్తవ చరిత్రలో అత్యంత ప్రముఖుడైన చౌదరి శ్రీకాకుళం జిల్లాలోనే జన్మించారు. పాతపట్నం నియోజకవర్గంలోని తెంబూరు దగ్గరున్న మదనాపురం ఆయన జన్మస్థలం. 1803 సెప్టెంబరు 5న సుభద్రాదేవి, కూర్మానాథ చౌదరి దంపతులకు ద్వితీయ పుత్రుడతడు. బెంగాళీ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన పురుషోత్తమ చౌదరిపై 1825లో క్రైస్తవమత ప్రభావం పడింది. 1832 జులైలో మదరాసు గవర్నరు సర్‌థామస్‌ మన్రో ఆదేశం ప్రకారం, పర్లాకిమిడి అల్లర్లను అణచివేయడానికి రస్సెల్‌ అనే కమీషనర్‌ వచ్చాడు. కాకతాళీయంగా అతనికి, చౌదరి తారసిల్లి క్రైస్తవం పట్ల ఆసక్తిని వెల్లడించారు. 1833లో శ్రీకాకుళం వచ్చి, ఒక బాలికల పాఠశాలలో ఉన్న హెలెన్‌ నాట్‌ అనే బ్రిటీష్‌ మహిళను కలిశారు. ఆమె సిఫార్సుతో మద్రాసు వెళ్లడానికి సిద్ధమౌతున్న దశలో, బంధువులు వచ్చి ఇంటికి తీసుకుపోయారు. అప్పటికే ఆయనకు వివాహమైంది. ఓ బిడ్డను కూడా కన్నారు. 1829 నాటికి విశాఖపట్నం చేరి, క్రైస్తవ సాహిత్యాన్ని అద్యయనం చేశారు. 1833లో 'కులాచార పరీక్ష' అనే పత్రికను రాసి, కులవ్యవస్థను ఖండించారు. 1833 అక్టోబరులో కటక్‌లో 'బాప్తిస్మం' తీసుకొని, క్రైస్తవ మత ప్రచారం ప్రారంభించారు. 18 రోజులు కాలినడకన ప్రచారం చేస్తూ మద్రాసు వెళ్లారు. అక్కడి నుంచి బళ్లారి, విశాఖపట్నం, శ్రీకాకుళం, బరంపురంలలో ప్రచారం చేశారు. ఎన్నెన్నో కీర్తనలు రచించారు. ఈరోజు చౌదరి రాసిన కీర్తన వినిపించని చర్చి, క్రైస్తవుల ఇళ్లు లేవంటే అతిశయోక్తి కాదు. వేదపండితులతో వాదించి, చాలాచోట్ల నెగ్గుకొచ్చారు. తుని సంస్థానంలో, జమీందారు సమక్షంలో జరిగిన చర్చలో విజయవంతమయ్యారు. 67 ఏళ్ల వయసు వరకూ ఆంధ్రప్రదేశ్‌లోనే ఉండి, జీవిత చరమాంకాన్ని కటక్‌లోని పిల్లల దగ్గర గడిపారు. 1890 ఆగస్టు 23న తన 87వ ఏట చౌదరి కన్నుమూశారు. 1933లో చౌదరి శతజయంతి ఉత్సవాలు ఆంధ్రా-ఒరిస్సాలో ఘనంగా నిర్వహించారు. పర్లాకిమిడిలో స్మారకమందిరం నిర్మించారు. పురుషోత్తమ చౌదరిని తెలుగు క్రైస్తవ పదకవితా పితామహుడిగా గుర్తించడానికి కారణం లేకపోలేదు. ఆయనకు ముందు ఇంగ్లీష్‌, జర్మన్‌, లాటిన్‌ మొదలైన ఐరోపా భాషల్లోని గీతస్వరాలు, కృతిక అనువాదాలే కీర్తనలుగా ఉండేవి. దేశవాళి బాణీలతో, స్వతంత్ర శైలిలో పాటలు రాసింది పురుషోత్తమ చౌదరే. అందుకే తెలుగు క్రైస్తవ పద కవితకు ఆయన ఆద్యుడు. విదేశీ వాగ్గేయకారుడు, బహుభాషా కోవిదుడైన విలియండాసన్‌, చౌదరి మంచి స్నేహితులు. సి.పి.బ్రౌన్‌ సమకాలీకుడు. 1994-95లో పురుషోత్తమ చౌదరి జీవితం రచనలపై డాక్టర్‌ సుధారత్నాంజలి సామ్యూల్‌ ఎం.ఫిల్‌ను మద్రాసు యూనివర్శిటిలో చేశారు. పురుషోత్తమ చౌదరి స్వహస్తాలతో శ్రీకాకుళం చిన్నబజారులోని తెలుగు బాప్తిస్టు చర్చిని దాదాపు 150 ఏళ్ల క్రితం నిర్మించారు. ఆయన భార్య శ్రీకాకుళంలోనే మరణించారు. చౌదరితో ముడిపడిన తెలుగు క్రైస్తవ సాహిత్యం ఇంకా వెలుగుచూడాల్సి ఉంది.
వ్యవహార భాషోద్యమ భగీరథుడు గిడుగు రామ్మూర్తి పంతులు
ఆంధ్రభారతి కృత్రిమ (గ్రాంధిక) అలంకారాల భారంతో కుంగి కృశిస్తూ కళ తప్పి ఉన్న సమయంలో సజీవమైన ప్రజల వాడుక భాషా ప్రయోగాలతో ఆంధ్రభారతికి నవ్యత చేకూర్చడానికి ఒక మహోద్యమం నడిపిన మహామనిషి గిడుగు రామ్మూర్తి పంతులు. కాలం మారింది.. సాహిత్యం సామాన్య ప్రజల్లోకి చొచ్చుకుపోవాల్సి ఉంది. వ్యవహారిక భాషతోనే ఇది సాధ్యమన్నది ఆయన దృఢ విశ్వాసం. సాధారణంగా మార్పును సమాజం అంత తేలికగా అంగీకరించదు. కందుకూరి వీరేశలింగం వితంతు పునర్వివాహానికి ఉద్యమించినపుడు, ఇతర సాంఘిక సంస్కరణలు ప్రబోధించినపుడు ఆయనకు ఎదురైన గట్టి సవాళ్లవంటివే రామ్మూర్తి పంతులు వ్యవహారిక భాషోద్యమాన్ని చేపట్టినపుడూ ఎదురయ్యాయి. వ్యవహారిక భాష పేరు తలచుకుంటే తెలుగు సాహిత్యం మైలు పడిపోతుందన్న భాషా ఛాందసులు తెలుగు సాహితీలోకాన్ని ఏలుతున్న రోజులవి. గిడుగు సాహసించి ఈ కొత్త ప్రతిపాదన చేసినపుడు వారు ఎదురుతిరిగారు. అయినా గిడుగు వెనుకంజ వేయలేదు. శుద్ధగ్రాంథికవాదులను ఢీకొని వారిని నిరుత్తరులను చేశారు. జయంతి రామయ్యపంతులు, రాజా విక్రమదేవవర్మ, పిఠాపురం రాజా వంటి ఉద్దండులు గిడుగును ఎదుర్కొన్నారు. ఆనాటి వ్యవహారిక ప్రయోగాలను ఉటంకిస్తూ వారివాదాన్ని గిడుగురామ్మూర్తి పంతులు తిప్పికొట్టారు. గిడుగువారిది ప్రజాఉద్యమం. అందుకనే ఆనాటి యువకవులు, పత్రికలు గిడుగు వారి వ్యవహారిక భాషావాదాన్ని స్వీకరించి దాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఇందుకు కొంత వ్యవధి అనివార్యమైంది. 20వ శతాబ్ది ప్రవేశించిన నాటికి ఆంధ్రదేశంలో నూటికి తొమ్మండుగురు కూడా అక్షరాస్యులు లేరు. పాశ్చాత్యదేశాల్లో ఆనాటికే 90 శాతం మంది విద్యావంతులు. ఆయా దేశాల్లో బోధనా భాష వ్యవహారికంగా ఉండడమే అందుకు కారణం. ఆంధ్రదేశంలో బోధనాభాషగా గ్రాంథిక భాష ఉండడం వల్ల పరభాష అయినా ఇంగ్లీషు నేర్చుకోవడం కన్నా తెలుగు నేర్చుకోవడం విద్యార్థులకు కష్టంగా ఉండేది. కాస్తో, కూస్తో విద్యనభ్యసించినవారు వారు కూడా గ్రాంథిక భాషలో ఉండే గ్రంథాలను, పత్రికలను చదివి అర్ధం చేసుకోలేక నేర్చుకున్న అక్షరాలను కూడా కొన్నాళ్లకు మరిచిపోయేవారు. చేతిరాతకు, నోటిమాటకు పరస్పర సంబంధం లేక భాష అందరికీ అందుబాటులో లేకపోయిందని గిడుగువారు గ్రహించారు. ప్రజలను అక్షరాస్యులను చేసి వారికి ఆధునిక విజ్ఞానాన్ని తేలికైనభాషలో అందజేసి దేశ పురోభవృద్ధికి కృషిచేయాలని గిడుగు నిర్ణయించారు.
పండితులతో తలపడి..
1910లో వ్యవహార భాషోద్యమాన్ని ఆయన పర్లాకిమిడిలో ప్రారంభించారు. 1915 నుంచి 1919 వరకు రామ్మూర్తి బరంపురం నుంచి మద్రాసు వరకు ఊరూరా తిరిగి పండితులను ఢీకొన్నారు. వేటూరి ప్రభాకరశాస్త్రి వంటి పండితుల చేత తన వాదాన్ని అంగీకరింపజేశారు. జయంతి రామయ్య పంతులు, వేదం వెంకటరామశాస్త్రి, శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి వంటి ప్రముఖులు రచించిన గ్రంథాల్లో దోషాలను చూపించి ఉద్దండ పండితులకే గ్రాంథికభాష పట్టుబడక తప్పులు రాస్తున్నపుడు బడి పిల్లలకు నేర్పడమా అని గిడుగువారు వాదించారు. నాడు గ్రాంధికభాషలో దిట్ట, మంచి వక్త అయిన కొక్కొండ వెంకటరత్నాన్ని తన వాదనతో గిడుగు మట్టికరిపించారు. అయితే గిడుగుకు కుడిభుజంగా ఉన్న గురజాడ అప్పారావు 1916లో మరణించారు. 1916లో కొవ్వూరులో ఆంధ్ర మహాపరిషత్తు ఏర్పాటు చేసిన సభలో కందుకూరి వీరేశలింగం మద్దతు గిడుగుకు లభించింది. 1919 ఫిబ్రవరి 28న గిడుగు అధ్యక్షతన వర్తమానాంధ్ర భాషా ప్రవర్తక సమాజం రాజమండ్రిలో ఏర్పడింది. నాడు నాలుగు ప్రధానమైన తీర్మానాలు చేశారు. గ్రాంధికభాషకు వ్యవహారిక భాషకు ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించడం, వైజ్ఞానిక గ్రంథాల నుంచి గ్రాంధిక పదాలు తొలగించడం అవసరమైన అన్యదేశ పదాలను స్వీకరించి అనావశ్యకములైన వాటిని విడిచిపెట్టడం నాటి ప్రధానమైన తీర్మానాలు.
-
పత్రికల ప్రోత్సాహం
గురజాడ మృతితో ఏర్పడిన కొరత కందుకూరి సహచర్యంతో తీరిందని రామ్మూర్తి సంతోషించారు. 1919 మే 27న వీరేశలింగం కూడా చనిపోయారు. రామ్మూర్తి పట్టుసడలలేదు. తెలుగు పత్రిక వెలువరించారు. వాడుక భాషలో గల వ్యాసాలను యువ రచయితలు ఆదరించారు. ఆ దశలో కాశీనాధుని నాగేశ్వరరావు 'భారతి'లో వ్యవహారికభాషలో రాసిన వ్యాసాలను ప్రచురించసాగారు. గుంటూరు, శారద, మాలపల్లి పత్రికలు కూడా వాడుకభాషను ప్రోత్సహించాయి. ఒకప్పుడు వ్యవహారికభాషను ఎదిరించిన మల్లాది సూర్యనారాయణశాస్త్రి చివరకు గిడుగువారి శిష్యవర్గాల్లో చేరారు. 1880 ప్రాంతంలో రామ్మూర్తికి పర్లాకిమిడి జమిందారులతో మైత్రి, సత్సంబంధాలు ఉండేవి. 1928లో జమిందార్లతో వైరం ఏర్పడినా తన భాషోద్యమాన్ని విడనాడలేదు. 1913లో రామ్మూర్తి తొలిసారిగా రాజమండ్రిలో కాలుపెట్టినప్పుడు శుద్ధ గ్రాంధికవాదులు ఆయనను విమర్శించారు. వెళ్లిపొమ్మని హెచ్చరించారు. 1933లో అదే రాజమండ్రిలో ఆయనను భారీ ఎత్తున సన్మానించారు. ఇది రాజమండ్రిలో వ్యవహారిక భాషోద్యమం సాధించిన విజయంగా పేర్కొన్నారు. ఇంగ్లాండ్‌ నుంచి వచ్చిన మేట్స్‌దొర వాడుకభాషకు, బోధనా భాషకు తేడా గమనించి గిడుగువారితో ప్రస్తావించారు. మేట్స్‌ దొర స్ఫూర్తితో గిడుగు వాడుక భాషోద్యమం ప్రారంభించారు. వృత్తిరీత్యా చరిత్ర అధ్యాపకుడైన గిడుగుకు తెలుగు భాషపై మంచి పట్టుండేది. 1940 జనవరి 22న చెన్నైలో ఆయన మరణించేనాటికి వ్యవహారిక భాషోద్యమం తెలుగుసీమలో స్థిరపడింది. పత్రికలు వ్యవహారిక భాషను స్వీకరించాయి. రచయితలు వాడుకభాషలోకొచ్చారు. నండూరి సుబ్బారావు వంటివారు శుద్ధ జానపద భాషలో ఎంకిపాటలు రాసి సంచలనం సృష్టించారు. వనరాజు అప్పారావు, చింతా దీక్షితులు తదితరులు కవిత్వంలో వాడుకభాషకు ప్రాధాన్యమిచ్చి అజరామరమైన రచనలను అందించారు. విశ్వవిద్యాలయాలు, పాఠశాలల్లో మాత్రం వ్యవహారిక భాషను అప్పటికి స్వీకరించలేదు. మాతృభాషలోనే కాదు వాడుక భాషలో విద్యాబోధన జరగాలన్న ఆయన సింహనాధం బధిరుని ముందు శంఖారావమే. ఆంధ్ర విశ్వావిద్యాలయం ఆయనను 'కళాప్రపూర్ణ'తో సత్కరించినా ఆయన జీవితధ్యేయమైన వ్యవహారికభాషను బోధనాభాషగా ప్రవేశపెట్ట సాహసించలేకపోయింది. రామ్మూర్తి తన తుది సందేశంలో విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వమూ వ్యవహారిక భాషను స్వీకరించేటట్లు ఉద్యమించాల్సింది ఇక పత్రికలే అన్నారు. తరువాత కాలంలో గిడుగు వారి జీవిత్యధ్యేయం నెరవేరింది.
సవరభాషకు లిపి
లిపి లేని ఆటవిక సవరభాషకు లిపి సృష్టించి దానికి గౌరవనీయమైన స్థానం కల్పించిన అపర భగీరథుడాయన. సవరల ఆచార వ్యవహారాలను ఆయన గమనించారు. తెలుగుకు, ఒరియాకు భిన్నమైన సవరభాషను ఆయన నేర్చుకున్నారు. ఫొనెటిక్స్‌ లిపిని కనుగొన్నారు. నాటి విద్యాశాఖాధికారి సవరభాషకు లిపి అవసరం లేదంటూ వాదించారు. 1930 నవంబరు 3న సెరంగో గ్రామంలో కలెక్టర్‌ సమక్షంలో సవరపిల్లల చేత ఫొనెటిక్స్‌ అక్షరాలతో సవర పదాలను రాయనేర్పి వారిచేత రాయించి చూపించారు. దీంతో బ్రిటీష్‌ ప్రభుత్వం రామ్మూర్తి ఫొనెటిక్‌ లిపిని ఆమోదించింది. 1931లో సవర వ్యాకరణాన్ని, 1933లో ఇంగ్లీషు నిఘంటువును గిడుగు రామ్మూర్తి ఆయన కుమారుడు సీతాపతి ఇద్దరూ కలిసి రూపొందించారు.
ప్రభుత్వ సత్కారం

గిడుగు పరిశోధనలను, సవరభాషలో చేసిన కృషిని బ్రిటీష్‌ ప్రభుత్వం మెచ్చి 1933 జనవరి 1న కైజర్‌-ఇ-హింద్‌ అన్న బిరుదుతో పాటు బంగారు పతకాన్ని ఇచ్చింది. 1933 మే 6న అయిదో జార్జి చక్రవర్తి రజతోత్సవ బంగారు పతకాన్ని కూడా ప్రభుత్వం ఇచ్చింది.
బ్రిటిష్‌ పాలకుల గుండెల్లో.. గరిమెళ్ల అక్షరాగ్ని

మాకొద్దీ తెల్లదొరతనమూదేవా!
మాకోద్దీ తెల్లదొరతనమూ
మా ప్రాణాలపై పొంచి
మానాలు హరియించే..
జాతీయ కవి గరిమెళ్ల సత్యనారాయణ రచించిన ఈ గేయం తెల్లదొరల గుండెల్ని జల్లుమనిపించింది. స్వాతంత్య్ర సంగ్రామంలో పోరాటాలను తమ భుజస్కందాలపై మోస్తూ ప్రజల్లో స్వాతంత్రోద్యమ కాంక్షను రగిల్చిన ఘన కీర్తిగల జాతి మరిచిన జాతిరత్నం గరిమెళ్ల సత్యనారాయణ. ఈయనది శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం ప్రియాగ్రహారం స్వగ్రామం. 1893 జులై 15న సరుబుజ్జిలి మండలం గోనెలపాడు గ్రామం తమ తాతగారి స్వగ్రామంలో జన్మించారు. ప్రాథమిక విద్యాభ్యాసం స్వగ్రామమైన ప్రియాగ్రహారంలో కొనసాగించారు. గరిమెళ్ల తల్లిదండ్రులైన సూరమ్మ, వెంకటనర్సింహంతో ఉన్నా ఉన్నత చదువులను మధ్యలో వదిలేసి పరాయిపాలన నుంచి విముక్తి కోసం, వలస పాలకులకు వ్యతిరేకంగా సాగుతున్న సమరభేరి ఉద్యమానికి మద్దతుగా నిలిచారు. 'స్వరాజ్య గీతాలు' రాసినందుకుగాను గరిమెళ్లకు బ్రిటిష్‌ ప్రభుత్వం రాజద్రోహం నేరం కింద రెండేళ్లు జైలుశిక్ష విధించింది. తన జైలు శిక్షాకాలంలో 1923లో తండ్రి మరణించారు. తన జైలు శిక్షణానంతరం స్వగ్రామం ప్రియాగ్రహారంలో రచనలు చేస్తూ 1926లో మొదటిసారిగా తమ గ్రామంలో శారదా గ్రంథాలయాన్ని ప్రారంభించారు. అప్పుడే అఖండకావ్యాలు, 'స్వరాజ్య గీతాలు' 'అర్ధత్రయ సర్వస్వం' 'మాణిక్యం' తదితర పుస్తకాలను ముద్రించారు. అగ్రకులంలో పుట్టినప్పటికీ జనంతో మమేకమైపోయేవారు. బతుకుతెరువు కూటికోసం మద్రాస్‌ వలసవెళ్లారు. దుందుభి, వికారి తదితర పేర్లతో పత్రికల్లో వ్యాసాలు రాశారు. ఆంధ్రప్రభ దినపత్రికకు సహ సంపాదకులుగా కూడా పనిచేశారు. రాజీపడని మచ్చలేని వైఖరితో ముక్కుసూటి మనిషికావడంతో ఎందులోనూ స్థిరం కాలేకపోయారు. గరిమెళ్లను ఎంతగొప్పగా చెప్పినప్పటికీ తక్కువగానే చెప్పినట్టవుతుందని చెప్పవచ్చు. గరిమెళ్ల గేయకవి, నాటకకర్త, సంస్కర్త, అనువాదకుడు, అన్నింటికి మించి ఆదర్శనీయుడు, దేశభక్తి గల భారతీయుడు. వైద్యసౌకర్యం కొరత వలన పట్టించుకోకపోవడంతో తీవ్ర అనారోగ్యంతో డిసెంబరు 18-1952న మృతిచెందారు.
తెల్లబంగారం.. పలాస జీడి
 

తెల్లబంగారంగా పేరొందిన జీడిపప్పునకు మంచిపేరుంది. 1935 - 36 సంవత్సరంలో తొలుత మల్లా జనార్దన్‌ అనే వ్యాపారి అండమాన్‌, తూర్పుగోదావరి జిల్లా మోరి ప్రాంతాల నుంచి జీడి పిక్కలను పలాస ప్రాంతానికి తెచ్చారు. వాటిని పెనంపై వేయించి పప్పును తీశారు. దాంతో ఈ ప్రాంతంలో వ్యాపారం ప్రారంభమైంది. 1954 - 55 లో 12 ఫ్యాక్టరీలతో పలాస జీడిపప్పు ఉత్పత్తిదారుల సంఘం ఆవిర్భవించింది. 1963- 64 సంవత్సరంలో డ్రమ్ము రోస్టింగ్‌తో వ్యాపారం మరింత అభివృద్ధి చెందేందుకు దోహదపడింది. 1987 వరకు ఈ ప్రాంతంలో పూర్తి స్థాయిలో డ్రమ్ము రోస్టింగ్‌తోనే వ్యాపారం సాగింది. తరువాత బాయిలింగ్‌ విధానం అమల్లోకి వచ్చింది. 2007 నుంచి 60 శాతం వరకు బాయిలింగ్‌ విధానం అమలవుతోంది. జిల్లాలో 350 వరకు జీడి పప్పు యూనిట్లు ఉండగా అందులో ఒక్క పలాస ప్రాంతంలోనే 275 వరకు యూనిట్లు ఉన్నాయి. ఈ ప్రాంతం నుంచి రోజుకు 50 టన్నుల పప్పు ఉత్పత్తి అవుతోంది. జిల్లా వ్యాప్తంగా రోజుకు 5 వేల జీడి పిక్కల బస్తాలు ద్వారా 60 టన్నుల వరకు పప్పు ఉత్పత్తి అవుతోంది. పరోక్షంగా, ప్రత్యక్షంగా 50 వేల వరకు కార్మికులు ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. పలాస, మందస, వజ్రపుకొత్తూరు, మెళియాపుట్టి, కవిటి, సోంపేట, టెక్కలి, కంచిలి, పాలకొండ, సీతంపేట, కోటబొమ్మాళి, నందిగాం మండలాల్లో జీడి పరిశ్రమ విస్తరించి ఉంది. ప్రస్తుతం పట్టణాల్లో రోస్టింగ్‌ విధానానికి అనుమతులు లేవు. పల్లెల్లో సైతం అనుమతులు లేకున్నప్పటికీ కాల్పులు విధానం కొనసాగుతోంది. ఈ ప్రాంతంలో తయారయిన జీడి పప్పును ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌ఘడ్‌, మధ్యప్రదేశ్‌, పంజాబ్‌ రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. ఏటా జీడి గింజలు చాలనందున విదేశీ ముడిసరుకుపై ఆధారపడాల్సి వస్తోంది.
* బంగారం వ్యాపారానికి జిల్లాలో మంచి గుర్తింపు ఉంది. జిల్లాలో 550 జ్యూయలరీ దుకాణాలు ఉన్నాయి. శ్రీకాకుళం, నరసన్నపేట, పలాస, రాజాం, కాశీబుగ్గ తదితర కేంద్రాల్లో ఎక్కువగా వ్యాపారాలు సాగుతున్నాయి. ముంబాయి, చెన్నై తదితర ప్రాంతాల నుంచి బంగారాన్ని దిగుమతి చేసుకొని వ్యాపారాలు సాగిస్తున్నారు. ఏటా జిల్లాలో రూ. 1500 కోట్ల వ్యాపారం జరుగుతోంది. అలాగే వెండి ఆభరణాల వ్యాపారం కూడా ధీటుగా సాగుతోంది.
* జీడిపప్పు వ్యాపారం పలాస కేంద్రంగా సాగుతోంది. ప్రతిరోజు రూ. కోటి వంతున వ్యాపార లావాదేవీలు సాగుతున్నాయి. ఏటా రూ. 350 కోట్లకు తగ్గకుండా వ్యాపారం సాగిస్తున్నారు.
వాణిజ్యంలో మేటి నరసన్నపేట
శ్రీకాకుళం - టెక్కలి మధ్య ఉన్న నరసన్నపేట పేరున్న వ్యాపార కేంద్రాల్లో ఒకటి. ఇది బంగారం, వెండి, రైస్‌మిల్లు, ఇత్తడి, స్టీలు సామాగ్రి వ్యాపారాలకు ప్రసిద్ధి. ఈ ఒక్క నియోజకవర్గంలోనే 36 రైసు మిల్లులు ఉన్నాయి. ఇవన్నీ గత రెండేళ్లుగా మోడరన్‌ రైస్‌మిల్లులుగా అభివృద్ధి చెందాయి. ఏటా 50 వేల టన్నుల లెవీ లక్ష్యాన్ని అందిస్తున్నాయి. మరో 15 వేల టన్నులను బహిరంగ విక్రయాలకు తరలిస్తున్నాయి. నాలుగు మండలాలతో పాటు పరిసర మండలాల నుంచి ధాన్యం నరసన్నపేట కేంద్రానికి వస్తుంది. బంగారం వ్యాపారానికొస్తే నరసన్నపేట పట్టణంలో 50 దుకాణాలున్నాయి. 5 హోల్‌సేల్‌ దుకాణాలు పెద్దమొత్తంలో లావాదేవీలు సాగిస్తుంటాయి. నిత్యం రూ. 50 లక్షల మేరకు క్రయవిక్రయాలు నమోదవుతున్నాయి. ముంబాయి, చెన్నై తదితర ప్రాంతాల నుంచి బిస్కట్‌ బంగారాన్ని దిగుమతి చేసుకొని వ్యాపారులు లావాదేవీలు సాగిస్తారు. ఇత్తడి, స్టీలు సామగ్రిని గుంటూరు, విజయవాడ తదితర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకొని ఇక్కడ వ్యాపారం చేస్తుంటారు. ఇత్తడి, స్టీలు దుకాణాలు పట్టణంలో పది ఉన్నాయి. రోజూ రూ. లక్ష వరకు వ్యాపారం ఉంటుంది.
ఉద్దానం.... కొబ్బరి వ్యాపార కేంద్రం
-
ఉద్దానం ప్రాంతంలో 32 వేల ఎకరాల పరిధిలో కొబ్బరి సాగవుతోంది. కొబ్బరి ఉత్పత్తుల లావాదేవీలకు కంచిలిలో కొబ్బరి కాయలు, కొబ్బరిపీచు, ఈనెల వ్యాపార కేంద్రం ఉంది. రోజుకి కంచిలి నుంచి సీజన్‌లో 35 లారీలు, అన్‌సీజన్‌లో 15 లారీల కొబ్బరి కాయ ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతుంటుంది. సగటున రోజుకి 20 లారీలకు పైగా సరకు రవాణా అవుతోంది. ప్రస్తుతం వెయ్యి కాయ రూ. 6 వేల వరకు ధర పలుకుతుండడంతో రోజుకి రూ. 12 లక్షల నుంచి రూ. 15 లక్షల వ్యాపారం జరుగుతోంది. కంచిలిలో 30 వరకు కొబ్బరి వ్యాపార కేంద్రాలున్నాయి. కొబ్బరి పీచుపరంగా కంచిలి, సోంపేట, కవిటి, ఇచ్ఛాపురం మండలాల్లో 20 పరిశ్రమలుండగా వాటి ద్వారా రోజుకి రూ. 5 లక్షల మేర వ్యాపారం జరుగుతోంది. 30 కొబ్బరి ఈనెల పరిశ్రమల ద్వారా రూ. 3 లక్షల వ్యాపారం జరుగుతోంది. కొబ్బరి ఉత్పత్తుల ద్వారా సగటున రోజుకి రూ. 20 లక్షల నుంచి రూ. 25 లక్షల వరకు వ్యాపారం జరుగుతోంది.
అటవీశాఖ
జిల్లాలో 21 మండలాల్లో 1,71,178 మంది గిరిజనులు ఉన్నారు. సవర, జాతాపు, కాపుసవర, కొండదొర, మాలియాసవర, గదబ ఉపకులాలకు చెందిన గిరిజనులు వ్యవసాయం వృత్తిగా జీవిస్తున్నారు. భూమిలేని పేద కుటుంబాలు ఇప్పటికీ పదివేలకు పైగా ఉంటాయి. ఎక్కువగా ఆహార భద్రత సమస్య ఎదురౌతోంది. ప్రభుత్వం ఇస్తున్న రేషన్‌ సరిపోవడం లేదు. కేవలం 7500 కుటుంబాలకే అంత్యోదయ కార్డులు ఉన్నందున నెలకు 35 కిలోల బియ్యం లభ్యమవుతోంది. మిగిలిన 28 వేల కుటుంబాలకు ఈ సౌకర్యం లేదు.
అటవీ విస్తీర్ణం : 70544 హెక్టార్లు
టేకు - బగ్గా ప్రాంతం (కొత్తూరు) 220 హెక్టార్లలో విస్తీర్ణంలో ఉంది.
జాదుపల్లి (పాతపట్నం) 80 హెక్టార్లలో ఉంది
గుగ్గిలం - దోనుభాయి (సీతంపేట) 40 హెక్టార్లలో ఉంది.
పక్షులు - గూడబాతులు, పెలికాన్‌, పెయింటెడ్‌స్టార్స్‌, సీతాకోకచిలుకలు, రామచిలుకలు, నెమళ్లు
ఫలసాయం - నల్లజీడి, వెదురు, అడ్డాకులు, బీడిఆకులు, తేనె, చీపురుపుల్లలు,గంకరయ్‌
చెట్లు రకాలు- నల్లరేగు, మద్ది, పాలచెట్టు, పాసి, వెదురు, తపసి, గుగ్గిలం, టేకు, విప్ప, గనర, పుల్లేరు, పనస, మామిడి, పొదలు
జంతువులు - ఏనుగులు(4) జింకలు, దుప్పిలు, అడవిపందులు, ఎలుగుబంట్లు, అరుదైన కింగ్‌కోబ్రా, ఇతర సర్పజాతులు
వనసంరక్షణ సమితులు
* జిల్లాలో 241 సమితులు ఉన్నాయి.
* 1985లో వీటిని ఏర్పాటు చేశారు
* జిల్లాలో 28 మండలాల్లో అటవీప్రాంతం ఉంది.
* అటవీహక్కుల చట్టం కింద తొలివిడతలో 24615.12 ఎకరాలు, రెండో విడతలో 4 వేల ఎకరాలు అటవీ భూమిని పంపిణీ చేశారు.
రెవెన్యూశాఖ
జిల్లాలో 38 మండలాలు, 1865 గ్రామాలున్నాయి. పంటల వివరాలు, అజమాయిషీలతో పాటు గతంలో వి.ఆర్‌.ఓ.లు పోలీసు వ్యవస్థకు సంబంధించిన విధులు నిర్వహించేవారు. ప్రస్తుతం మాత్రం ఈ విధులు వీరి పరిధి నుంచి తొలగించారు. భూపరిరక్షణ, ప్రకృతి వైపరీత్యాలు, అగ్నిప్రమాదాలు జనన, మరణ ధృవీకరణాలు, పట్టాదారుపాస్‌ పుస్తకాలు, వాటర్‌ట్యాంక్స్‌, పంటల వివరాలు, ఆక్రమణలు జరగకుండా చూడడం, ఆపద్భందు, జాతీయ కుటుంబ బీమా పథకం, ముఖ్యమంత్రి సహాయ నిధి తదితర అంశాలు వీరి పరిధిలో ఉంటాయి. లీడ్‌ బ్యాంకు కార్యక్రమాలు కూడా రెవెన్యూశాఖ చూస్తోంది. ఆర్‌.ఆర్‌. యాక్టు పౌరసరఫరాల శాఖ వంటి కీలకమైన వ్యవస్థలు ఈ శాఖ ఆధీనంలోనే ఉంటాయి.
ఖనిజ సంపద
జిల్లాలో మొత్తం 5 రకాల ఖనిజాలు లభ్యమవుతున్నాయి. అవి క్వాట్త్జెట్‌, మాంగనీసు, బీచ్‌సాండ్‌, గ్రానైట్‌, రోడ్డుమెటల్‌
* క్వాట్త్జెట్‌ ఖనిజం జిల్లాలో పొందూరు మండలంలోని నందివాడ, వి.ఆర్‌.గూడెం, పుల్లాజిపేటతో పాటు రణస్థలం మండలంలోని సంచాం, అర్జునవలస, పాలకొండ మండలం బెజ్జి, వీరఘట్టాం మండలం వండవ గ్రామంలో లభ్యమవుతున్నాయి. ఈ ఖనిజానికి దేశవ్యాప్తంగా పెద్దగా గిరాకీ లేకపోవడంతో ఎగుమతులు అంతగా లేవు.
* మాంగనీసు ఖనిజం జిల్లాలో జి.సిగడాం మండలం బాతువా, లావేరు మండలం పెదలింగాలవలస గ్రామాల్లో లభిస్తోంది. ఏడాది మొత్తంమీద ఈ ఖనిజం రవాణా ద్వారా జిల్లాకు రూ. 5 లక్షల ఆదాయం వస్తోంది.
* బీచ్‌సాండ్‌ ఖనిజం జిల్లాలోని సముద్రతీరంతో పాటు వంశధార నాగావళి నదీపరివాహకప్రాంత మొత్తంమీద లభ్యమవుతోంది. ఈ ఇసుకలో గార్నెట్‌, ఇల్లిమినేట్‌, మోనోజైట్‌, జెట్‌క్రాన్‌, సిలిమినేట్‌ అనే ఉప ఖనిజాలు లభ్యమవుతాయి. వీటి రవాణా ద్వారా జిల్లాకు జిల్లాకు ఏడాదికి రూ. కోటి 20 లక్షల ఆదాయం లభిస్తోంది.
* జిల్లాలో టెక్కలి, సారవకోట, సింగుపురం, పొందూరు, పాలకొండ, సీతంపేట, వంగర, తదితర ప్రాంతాలలో గ్రానైట్‌ అత్యధికంగా లభిస్తోంది. నీలి గ్రానైట్‌ ఈ జిల్లా ప్రత్యేకత. దీని వల్లఏడాదికి సుమారు రూ.20 కోట్ల వరకు ఆదాయం వస్తోంది.
* రెడ్‌మెటల్‌ ఖనిజం జిల్లాలో పొందూరు, సింగుపురం, రాజాం తదితర ప్రాంతాలలో లభిస్తోంది. ఏడాదికి రూ. 5 కోట్ల దాకా ఆదాయం జిల్లాకు సమకూరుతోంది.
జనాభా
* జిల్లాలో 2001 జనాభాతో పోలిస్తే పదేళ్ల కాలంలో 25,37,593 నుంచి 26,99,471కు పెరిగారు అంటే 1,61,878 మంది పెరిగారు.
* జనాభా వృద్ధిరేటు గణనీయంగా తగ్గింది. ఆరేళ్లలోపు చిన్నారుల సంఖ్య జిల్లాలో తగ్గుముఖం పట్టింది.
* 2011 లెక్కల ప్రకారం 0-6 సంవత్సరాల మధ్య వయసున్న చిన్నారులు జిల్లాలో 2,65,404 మంది ఉన్నారు. వీరిలో మగపిల్లలు 1,35,929, ఆడపిల్లలు 1,29,475 మంది.
* 2001 జనాభా లెక్కలతో పోలిస్తే 3.41 శాతం తగ్గారు. జిల్లాలో 38 మండలాల్లో జనాభా ప్రతి పదేళ్లకు పెరుగుతూ వచ్చింది. ఈసారి ఏకంగా 6 మండలాల్లో జనాభా వృద్ధిరేటు గణనీయంగా పడిపోయింది. వంగర మండలంలో అత్యధికంగా 14.13 శాతం, రాజాం రూరల్‌ 11.09 శాతం, ఆమదాలవలస రూరల్‌లో 3.86 శాతం, సంతకవిటిలో 2.50 శాతం, బూర్జలో 1.20 శాతం, జలుమూరులో 1 శాతం, పోలాకిలో 0.15 శాతం చొప్పున జనాభా వృద్ధిరేటు తగ్గింది.
* జిల్లాలో పురుషుల కంటే మహిళలు అధికంగా ఉన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో ప్రతి వెయ్యిమంది పురుషులకు 1014 మంది మహిళలు ఉన్నట్లు తేలింది. 2001 సంవత్సరంలో స్త్రీ పురుష నిష్పత్తి1000 : 1014గా ఉంది. పదేళ్లకాలంలో ఒకేరీతిలో ఈ నిష్పత్తి కొనసాగుతుండడం విశేషం.
వ్యవసాయం
 
జిల్లాలో ప్రధాన పంట వరిసాగు. ఖరీఫ్‌లో అన్ని పంటలు కలిపి 2,50,497 హెక్టార్లలో సాగవుతున్నాయి. ఇందులో కాల్వల కింద 1,20,634 హెక్టార్లు, చెరువుల కింద 30,362 హెక్టార్లు, బావుల కింద 6080 హెక్టార్లు, ఇతర నీటి వనరుల కింద 4906 హెక్టార్లు సాగవుతున్నాయి. మిగిలినది వర్షాధారం.
ఖరీఫ్‌లో వరి 1,96,245 హెక్టార్లలో సాగవుతోంది. చెరకు 7,389 హెక్టార్లలోనూ, జొన్న 226 హెక్టార్లలోనూ, గంటి - 2,618 హెక్టార్లు, మొక్కజొన్న - 2055 హెక్టార్లు, చోడి - 1288 హెక్టార్లు, కందులు - 1451 హెక్టార్లు, పెసర - 1709 హెక్టార్లు, మినుము - 760 హెక్టార్లు, వేరుశనగ - 22,506 హెక్టార్లు, నువ్వులు - 2,532 హెక్టార్లు, ప్రత్తి - 1908 హెక్టార్లు, గోగు - 9810 హెక్టార్లు.
జిల్లాలో రబీసాగు అంతగా ఉండదు. కారణం.. సరైన నీటి వసతి లేకపోవటమే. జిల్లాలో 1,11,246 హెక్టార్ల విస్తీర్ణంలోనే పంటలు సాగవుతాయి. ఇందులో అత్యధికశాతం ఆరుతడి పంటలే.
* రబీలో వరి కేవలం 3052 హెక్టార్లలోనే సాగవుతోంది.
* జొన్న 14 హెక్టార్లు, మొక్కజొన్న 1,836 హెక్టార్లు, చోడి 1242 హెక్టార్లు, ఉలవలు 10,032 హెక్టార్లు, పెసర 31,579 హెక్టార్లు, మినుము 43,401 హెక్టార్లు, బఠాణీ 12 హెక్టార్లు, మిరప 3113 హెక్టార్లు, ఉల్లి 1364 హెక్టార్లు, వేరుశనగ 7376 హెక్టార్లు, నువ్వులు 4989 హెక్టార్లు, పొద్దుతిరుగుడు 3162 హెక్టార్లు, పొగాకు 74 హెక్టార్లలో సాగవుతాయి.
వరి
* జిల్లాలో ప్రధాన పంట వరి. ఏటా ఖరీఫ్‌ కాలంలో 12 లక్షల టన్నుల మేరకు దిగుబడి వస్తోంది. ఇది కాకుండా ఒరిస్సా నుంచి మరో 10 లక్షల టన్నుల వరకు దిగుమతి చేసుకుంటున్నారు. స్వర్ణ, సాంబ తదితర రకాలు సాగు చేస్తున్నారు. జిల్లాలో 281 రైసు మిల్లులు ఉన్నాయి. జిల్లాలో ఏటా రూ. 2,200 కోట్ల వ్యాపార లావాదేవీలు సాగుతున్నాయి. లెవీ రూపంలో 3.20 లక్షల టన్నుల బియ్యాన్ని ప్రభుత్వానికి ఇస్తున్నారు. మరో 4 లక్షల టన్నుల వరకు జిల్లాలో ప్రజలు వినియోగిస్తున్నారు.
జిల్లాలో వ్యవసాయ పరిశోధనాస్థానాలు, వ్యవసాయ కళాశాలలు
జిల్లాలో రాగోలు, సీతంపేటలో వ్యవసాయ పరిశోధనా స్థానాలు పెద్దపేటలో విత్తనాభివృద్ధి క్షేత్రం, ఆమదాలవలసలో గోగు పరిశోధనాస్థానం, కృషి విజ్ఞాన కేంద్రం, ఏరువాక (డాట్‌) కేంద్రం, నైరలో వ్యవసాయ కళాశాల ఉన్నాయి.
* రాగోలు వ్యవసాయ పరిశోధనాస్థానం శ్రీకాకుళానికి సమీపాన 1964లో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ కేంద్రం ద్వారా ఉల్లికోడును తట్టుకునే పది రకాల విత్తనాలను శాస్త్రవేత్తలు విడుదల చేశారు. వీటిలో వంశధార (ఆర్‌.జి.ఎల్‌. 11414), శ్రీకాకుళం సన్నాలు (ఆర్‌.జి.ఎల్‌. 2537), శ్రీకూర్మ (ఆర్‌.జి.ఎల్‌.2332), వసుంధర (ఆర్‌.జి.ఎల్‌. 2538)తో పాటు మెట్ట ప్రాంతాల్లో సాగుకు అనుకూలమైన శ్రీసత్య (ఆర్‌.జి.ఎల్‌. 1880), పుష్కల (ఆర్‌.జి.ఎల్‌. 2624) తదితర రకాలను విడుదల చేశారు. మరో నాలుగు రకాలపై పరిశోధనలు చేశారు. ఇవిగాక వరిలో పలు రకాలపై పరిశోధనలు చేస్తున్నారు.
* నైర వ్యవసాయ కళాశాలను 1989లో ఏర్పాటు చేశారు. ఈ కళాశాలలో నాలుగు సంవత్సరాల కోర్సు ఉంది. 2010-11 నుంచి అగ్రానమీ, ప్లాంట్‌ బ్రీడింగ్‌లో పిజి కోర్సులు ప్రవేశపెట్టారు.
* ఆమదాలవలసలో గోగు పరిశోధనాస్థానం ఉంది. దీన్ని 1958లో ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో గోగుపై ఇదొక్కటే పరిశోధనస్థానం. గోగు రకాల అభివృద్ధితో పాటు, గోగు పంట సాగులో యాజమాన్య పద్ధతులను రైతులకు తెలుపుతుంటారు.
* సీతంపేటలోని వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు గిరిజన ప్రాంతాల్లో సాగుకు అనువైన వరి, చోడి, సజ్జ, కంది, ఊదలు, వరిగలు తదితర పంటలపై పరిశోధనలు చేస్తున్నారు.
* ఆమదాలవలసలో కృషి విజ్ఞాన కేంద్రం ఉంది. ఇక్కడి శాస్త్రవేత్తలు వ్యవసాయ పరిజ్ఞానాన్ని రైతుల వద్దకు చేర్చటం, రైతులకు పంటల సాగు, యాజమాన్యంపై శిక్షణ, క్షేత్ర ప్రదర్శనలు వంటివి ఏర్పాటు చేస్తుంటారు.
* ఆమదాలవలసలో ఏరువాక (డాట్‌) కేంద్రం ఉంది. దీని శాస్త్రవేత్తలు వ్యవసాయ పరిజ్ఞానాన్ని రైతు వద్దకు చేర్చటం, గ్రామాల్లో రైతులకు పంటల సాగుపై సూచనలిస్తుంటారు.
జిల్లాలో పాలన
జిల్లాలో మూడు రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. అవి శ్రీకాకుళం, టెక్కలి, పాలకొండ. వీటి పరిధిలో 38 మండలాలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రధానంగా ఇచ్ఛాపురం నియోజకవర్గం సోంపేట, టెక్కలి నియోజకవర్గంలోని సంతబొమ్మాళి ప్రాంతాల్లో బొగ్గు ఆధారిత విద్యుదుత్పత్తి కేంద్రాల ఏర్పాటుపై ప్రధాన రాజకీయపక్షాలు రెండుగా చీలిపోయాయి. రణస్థలం మండలం కొవ్వాడ వద్ద ఏర్పాటు చేయనున్న అణవిద్యుత్తు పార్కు, వజ్రపుకొత్తూరు మండలం పూండి సమీపంలో బీచ్‌సాండ్‌ ప్రాజెక్టుల విషయంలో స్థానికంగా ఆందోళనలు రేగుతున్నాయి. 2011 జులై 23తో ఎంపీపీ, జిల్లా పరిషత్‌ల పాలకవర్గాల గడువు పూర్తికావడంతో ప్రభుత్వం ప్రత్యేకాధికార్లను నియమించింది. మూడు నెలల క్రితం కలెక్టరుగా వచ్చిన వెంకట్రామ్‌రెడ్డి పాలనపరంగా కొన్ని మార్పులు చేపట్టారు. ఇప్పటివరకు జిల్లా కేంద్రంలో, మండలాల్లో తహశిల్దారు కార్యాలయాల్లో ప్రతీ సోమవారం ఫిర్యాదుల విభాగాన్ని నిర్వహించేవారు. వెంకట్రామ్‌రెడ్డి మాత్రం జిల్లా కేంద్రానికి ఫిర్యాదులు ఇవ్వడానికి ఎవరూ రావొద్దని ప్రతీ సోమవారం మండల పరిషత్‌ కార్యాలయాల్లో అన్ని శాఖల అధికార్లు సమక్షంలో గ్రీవెన్సును నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. మూడు రెవెన్యూ డివిజన్లలో నిర్వహించే ఫిర్యాదుల విభాగానికి ఆయనే స్వయంగా హాజరవుతున్నారు. ప్రతీ శనివారం డయల్‌ యువర్‌ కలెక్టర్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పోలీసు శాఖాపరంగా కొన్ని సంస్కరణలు చేపట్టారు. గ్రామస్థాయిలో సమితులను ఏర్పాటు చేశారు. సంబంధిత పోలీసు ఎస్‌ఐ, సిబ్బంది గ్రామాల్లో తప్పనిసరిగా సమితుల సమావేశాలకు హాజరుకావాలి. రాత్రి అక్కడే నిద్ర చేయాలి. తద్వారా గ్రామస్థాయి సమస్యలను గుర్తించటం.. వాటిని ఉన్నతాధికారులకు నివేదించటం చేస్తున్నారు.
నేలలు
టెక్కలి డివిజన్‌లో వజ్రపుకొత్తూరు, మందస, కంచిలి, కవిటి, సోంపేట, ఇచ్ఛాపురం ప్రాంతాలను ఉద్దానం అంటారు. పలాస కూడా కొంత భాగం కలుస్తుంది. ఇవి పూర్తిగా ఇసుక నేలలు. అందుకే జీడి, కొబ్బరి పంటలు విస్తారంగా పండుతాయి. జిల్లాలో 19 గిరిజన మండలాలు ఉన్నాయి. వీటిలో ఎక్కువ భాగం కొండలే. పోడు వ్యవసాయం పెరగడం వల్ల అడవులు కనుమరుగైపోయాయి. జిల్లాలో ఉన్న కొండల్లో ఎక్కువగా గ్రానైట్‌ నిక్షేపాలు ఉన్నాయి. సీతంపేట, కొత్తూరు, భామిని, పాలకొండ గిరిజన ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే వాణిజ్య పంటలను పండిస్తున్నారు. ప్రధానంగా పైనాపిల్‌, చెరకు, సీతాఫలం, పనస తోటలు విస్తారంగా ఉన్నాయి. జిల్లాకు దక్షిణాన రణస్థలం, లావేరు, జి.సిగడాం, రాజాం, ఎచ్చెర్ల మండలాలు ఉన్నాయి. ఇవి ఎక్కువగా వర్షాధార భూములు ఎర్రరేగడి నేలలు కావడంతో మెట్టుపంటలు పండుతాయి. ప్రధానంగా వేరుశెనగ, వరి, కొబ్బరి, మొక్కజొన్న, బొప్పాయి, చెరకు, రాగులు, ఉలవ, నువ్వులు ఎక్కువగా పండుతాయి. జీడి, మామడి తోటలు కూడా ఎక్కువగా ఉన్నాయి. జిల్లాలో వంశధార, నాగావళి నదీపరివాహక ప్రాంతాలు నల్లరేగడి నేలలు. జలుమూరు, ఎల్‌.ఎన్‌.పేట, ఆమదాలవలస, సరుబుజ్జిలి, పాలకొండ, వీరఘట్టం, నరసన్నపేట, పోలాకి, గార, శ్రీకాకుళం ప్రాంతాల్లో 60 శాతం ఇసుకతో కూడి వరికి అనుకూలంగా ఉండే భూములు ఉన్నాయి. ఇక రణస్థలం నుంచి ఇచ్ఛాపురం వరకు 194 కి.మీ మేర సముద్రతీరం ఉంది. తీరం నుంచి 5 కిలోమీటర్ల పరిధిలో ఇసుక భూములే ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో సరుగుడు, జీడి, కొబ్బరి తోటలు విస్తారంగా ఉన్నాయి.
వర్షపాతం
జిల్లాలో సగటు వర్షపాతం సుమారు 1,100 మిల్లీమీటర్లు.గతేడాది సగటున 1,400 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 2007 నుంచి 2010 వరకు సగటున 700 మిల్లీమీటర్లుగానే నమోదైంది. ఒడిస్సా రాష్ట్రంలో వర్షాలు మోస్తరుగా పడితే వంశధార, నాగావళి, బహుదా, మహేంద్రతనయ నదుల్లోకి నీరు వస్తుంది. దీనికి తోడు జిల్లాలో వర్షాలు పడితేనే నదీతీరప్రాంతాల్లో వరి పండుతుంది. జిల్లాలో ఏటా ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో వరదొచ్చే కాలం. టెక్కలి, శ్రీకాకుళం రెవెన్యూ డివిజన్లలో వర్షాధారంపైనే పంటలు పండుతాయి. గత కొంతకాలంగా ఏప్రిల్‌ నుంచి ఆగస్టు వరకు ఈదురుగాలులు తీవ్రత పెరిగింది. బలమైన గాలుల వల్ల ఏటా చెరకు, అరటితోటలు నేలకూలుతున్నాయి. దీంతో రూ.లక్షలాది పంటకు నష్టం వాటిల్లుతోంది. జిల్లాలో పిడుగుపాటు మరణాలు ఎక్కువ. ఏటా సగటున 30 నుంచి 40 మంది వరకు పిడుగుపాటుకు మృత్యువాత పడుతున్నారు. క్షతగాత్రుల సంఖ్య వందకుపైగానే ఉంటోంది.
జిల్లాలో వాతావరణ పరిస్థితులు
శ్రీకాకుళం జిల్లా ఉత్తర పశ్చిమాల్లో ఒడిస్సాలోని మహేంద్రగిరి పర్వతశ్రేణులు గజపతి జిల్లా, దక్షిణ పశ్చిమాల్లో విజయనగరంజిల్లా, తూర్పున బంగాళాఖాతం ఎల్లలుగా ఉన్నాయి.
* జనవరి నుంచి మార్చి వరకు చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఏప్రిల్‌ నుంచి మే వరకు ఉదయం వరకు మంచుతాకిడి ఎక్కువ. వర్షాలు అడపాదడపా పడతాయి. మే, జూన్‌, జూలై నెలలో ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఉంటాయి. గరిష్ఠంగా 40 డిగ్రీల సెల్సియస్‌ వరకు నమోదవుతుంది. ఈ మూడు నెలలో సగుటున 36 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. సాయంత్రం సమయాల్లో ఈదురుగాలులు ప్రభావం ఉంటుంది. ఇదే సమయంలో ఇటీవల కాలంలో పిడుగులు కూడా పడుతున్నాయి. జూన్‌ నుంచి అక్టోబరు వరకు వర్షాలు ఎక్కువగా పడుతాయి. నవంబరు, డిసెంబరులో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ రెండు నెలల్లో కూడా అడపాదడపా వర్షాలు పడుతుంటాయి. శీతాకాలంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 12 నుంచి 14 డిగ్రీల వరకు నమోదు అవుతాయి.
సముద్రతీరం
 

జిల్లాలో 194 కిలోమీటర్ల పొడవైన సముద్రతీరం ఉంది. ఇది రాష్ట్రతీరప్రాంతంలో ఎక్కువ. 11 మండలాల్లో 104 గ్రామాల పరిధిలో సముద్రతీరం ఉంది. రణస్థలం, ఎచ్చెర్ల, శ్రీకాకుళం, గార, పోలాకి, సంతబొమ్మాళి, వజ్రపుకొత్తూరు, మందస, సోంపేట, కంచిలి, ఇచ్ఛాపురం మండలాల్లో ఈ తీరం ఉంది. సుమారు 10 వేల హెక్టార్ల అటవీ ప్రాంతం ఉంది. రణస్థలం మండలంలో పలు పరిశ్రమల్లో వచ్చే వ్వర్థాలను పైపుల ద్వారా సముద్రంలోకి విడచిపెట్టడంతో కాలుష్యం పెరిగి మత్స్యసంపద తగ్గిపోయింది. ఒకప్పుడు ఏడాదికి 35 వేల మెట్రిక్‌ టన్నులమత్స్యసంపదను వెలికితీస్తే ఇప్పుడు 20 వేల మెట్రిక్‌ టన్నులు కూడా దొరకడం లేదు. నేటికీ సంప్రదాబద్ధమైన పద్ధతిలోనే వేట సాగిస్తున్నారు.

శ్రీకాకుళం లో పడవలు :

విశాలమైన తీరప్రాంతం ఉన్న ఈ జల్లాలో (పరిధిలో) మొత్తం
సముద్రం లో 3,300 వరకు ఇంజన్ , మరబోట్లు ఉన్నాయి ,
నదుల్లో 15 వరకు నాటు పడవలు , ఉన్నాయి .
 శ్రీకాకుళం జిల్లాలో ఆలయాలు


శ్రీకాకుళం జిల్లాలో చిన్న చితకా సుమారు 822 ఆలయాలు ఉన్నాయి . ఆన్ లైన్‌ లో మాత్రము 50 నుంచి 60 ఆలయాలు మాత్రమే నమోదు అయ్యాయి . జిల్లా దేవాదాయ శాఖ పని తీరు బాగులేదు . తగినంతమంది ఉద్యోగులు ఆ శాఖలో లేరు . చలా ఉద్యోగాలు ఖాళీ గానే ఉన్నాయి.
శ్రీకాకుళం జిల్లాలో ఆలయాలకు చెందిన భూములు 11,201 ఎకరాల 31 సెంట్లు ( దేవాదాయ లెక్కలప్రకారము) ఉండగా ... అందులో సుమారు 2,822 ఎకరాల 81 సెంట్లు (దేవాదాయ శాఖ లెక్కల ప్రకారము) అన్యాక్రాంతము లో ఉన్నది . ఇంకా జిల్లాలో ఆలయాలకు సంభందించి .. 153 దుకాణాలు , 3 గెస్టు హౌస్ బిల్డింగులు ఉన్నాయి . ఎక్కువ అన్యాక్రాంత భూములు రాజకీయ పలుకబడితోనే జరుగుతుంది .
శ్రీకాకుళం పట్నం లో ఎన్నో హిందూ దేవాలయాలు , ముస్లిం మసీదులు -దర్గలు -మాస్కులు , క్రిష్టియన్‌ చెర్చ్ లు , బాబా మఠాలు ఉన్నాయి .

కొన్ని శివాలయాలు :
కొన్నావీధిలో ------- భీమేశ్వరాలయము ,
గుడివీధిలో -------- ఉమారుద్ర కోటేశ్వరాలము ,
గుజరాతీపేట లో ----లక్ష్యేశ్వరస్వామి ఆలయము ,
P.N.కాలనీ లో -----మృత్యుంజ స్వామి ఆలయం (వరసిద్ధి వినాయక గుడిలోపల),
బలగలో ---------- ఉత్తరేశ్వరాలయము ,
హడ్కోకోలనీ లో ---- కాశీవిశ్వేశ్వరాలయము ,
పాతశ్రీకాకుళము లో--కాశీవిశ్వేశ్వరాలయము ,
నక్కవీధి లో ------- ఉమాజఠలే్శ్వరాలయము ,
పాలకొండ రోడ్ లో ---శివరామలింగేశ్వరాలయము ,
రాచకట్ల వీధి లో -----పాతాలసిద్ధేశ్వరాలయము ,
అరసవల్లి --------- శివదేవాలయము ( సన్‌ టెంపుల్ ఆవరణలో ఉన్నది)

========================================

అందరు చదవండి. చదివించండి.. అందరితో పంచుకోండి..🙏