దేశంలోనే మొట్టమొదటిసారిగా... ఏపీలో టీచర్ ట్రైనింగ్ యూనివర్శిటీ ఏర్పాటు
• రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్
• రాష్ట్రంలో 2 కొత్త యూనివర్శిటీలు ఏర్పాటు
• ప్రకాశం జిల్లాలో ప్రారంభంకానున్న టీచర్ ట్రైనింగ్ యూనివర్శిటీ
• విజయనగరంలో మరో కొత్త యూనివర్శిటీ...
• ఈ విద్యా సంవత్సరం నుంచే బోధన ప్రారంభం...
• సెప్టెంబర్ లో ఉమ్మడి ప్రవేశ పరీక్షలు
• ఈ విద్యా సంవత్సరం నుంచి నాలుగేళ్ల డిగ్రీ ఆనర్స్ కోర్సులు
• తెలుగు, సంస్కృతం అకాడమీ ఏర్పాటుకు సీఎం గ్రీన్ సిగ్నల్
• త్వరలో 1110 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ
• కళాశాలల్లోనూ ‘నాడు-నేడు’ అమలు : మంత్రి ఆదిమూలపు సురేష్
❇️ఆంధ్రప్రదేశ్ లో ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో కొత్తగా రెండు
విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు
సురేష్ వెల్లడించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రకాశం జిల్లాలో టీచర్ ట్రైనింగ్
యూనివర్శిటీని ప్రారంభించడానికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారన్నారు.
చదువుతో పాటు ఉపాధి కల్పించేలా ఈ విద్యా సంవత్సరం నుంచే నాలుగేళ్ల ఆనర్స్
డిగ్రీ కోర్సులు ప్రవేశపెడుతున్నట్లు మంత్రి తెలిపారు. అక్టోబర్ 15వ తేదీ నుంచి
కళాశాలలు ప్రారంభించాలని, సెప్టెంబర్ లో ఉమ్మడి ప్రవేశ పరీక్షలు
నిర్వహించనున్నామని వెల్లడించారు.
❇️సచివాలయంలోని నాలుగో బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో గురువారం నిర్వహించిన
విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఉన్నత
విద్యా శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించామన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం
ప్రకటించిన నూతన జాతీయ విద్యా విధానం సీఎం జగన్మోహన్ రెడ్డి ఆలోచనలకనుగుణంగా
ఉందన్నారు. కొవిడ్-19 కారణంగా ప్రస్తుత విద్యా సంవత్సరం ఆలస్యంగా
ప్రారంభమవుతోందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని సిలబస్ లోనూ, పాఠ్యాంశాల బోధనలనూ
తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో అధికారులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేశారని
మంత్రి తెలిపారు.
🍁గ్రాస్ ఎన్ రోల్ మెంట్ పెంపుదలే లక్ష్యం...
❇️రాష్ట్రంలో విద్యాభివృద్ధికి సీఎం జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని తమ ప్రభుత్వం
అధిక ప్రాధాన్యతిస్తోందని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఎన్నో సంక్షేమ పథకాలు
విద్యా రంగంలో అమలు చేస్తున్నామన్నారు. ప్రభుత్వమందిస్తున్న సహకారంతో ఏ తరగతిలోనూ
డ్రాపౌట్లు ఉండకూడదని, పూర్తి స్థాయి ఫీజు రియింబర్స్ మెంట్, అమ్మఒడి, వసతి దీవెన
తదితర పథకాలతో పేద విద్యార్థుల పెద్ద చదువులకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని సీఎం
పేర్కొన్నారన్నారు. గ్రాస్ ఎన్ రోల్ మెంట్ 90 శాతానికి పెంచాలని అధికారులను సీఎం
జగన్మోహన్ రెడ్డి ఆదేశించారన్నారు.
🍁కొత్తగా రెండు యూనివర్శిటీలు...
రాష్ట్రంలో కొత్తగా రెండు యూనివర్శిటీలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం
నిర్ణయించిందని మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లలడించారు. ప్రకాశం, విజయనగరం
జిల్లాలో ఈ రెండు యూనివర్శిటీలు ఏర్పాటు చేయాలని, ఈ ఏడాది నుంచే వాటిని
ప్రారంభించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశించారన్నారు. వాటిలో ప్రకాశంలో ఏర్పాటు
కానున్న టీచర్ ట్రైనింగ్ యూనివర్శిటీ దేశంలోనే మొట్టమొదటిదని మంత్రి
వెల్లడించారు.
❇️ఈ యూనివర్శిటీ ద్వారా కిండర్ గార్డెన్ విద్యలో భాగంలో సర్టిఫికెట్ కోర్సులు
నిర్వహించనున్నామన్నారు. రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో ఉన్న టీచర్ ట్రైనింగ్
సెంటర్లన్నీ ఈ యూనివర్శిటీకి అనుసంధానం చేస్తామన్నారు. పాడేరులో ట్రైబుల్
యూనివర్శిటీ ఏర్పాటుకు సీఎం అంగీకరించారన్నారు. కర్నూల్ లోని క్లస్టర్
యూనివర్శిటీ పనులు త్వరితగతిన చేపట్టడంతో పాటు కడపలో ఆర్కిటెక్చర్ యూనివర్శిటీ
ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారన్నారు.
❇️రాష్ట్రంలో తెలుగు, సంస్కృతం అకాడమీ ప్రారంభానికి సీఎం గ్రీన్ సిగ్నల్
ఇచ్చినట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో పలు యూనివర్శిటీల్లో ఖాళీగా ఉన్న
1110 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి సీఎం జగన్మోహన్ రెడ్డి ఆమోదం
తెలిపారన్నారు.
❇️ఈ ఏడాది నుంచే నాలుగేళ్ల డిగ్రీ ఆనర్స్...
❇️ఈ ఏడాది విద్యా సంవత్సరం నుంచి నాలుగేళ్ల డిగ్రీ ఆనర్స్ కోర్సులు
ప్రారంభిస్తున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. బీఏ, బీకామ్, బీఎస్సీ
డిగ్రీలను మూడేళ్ల నుంచి నాలుగేళ్లకు పెంచుతూ వాటిని డిగ్రీ ఆనర్స్ కోర్సులుగా
పరిగణిస్తామన్నారు. డిగ్రీ చదువులు ఉపాధి, నైపుణ్యాభివృద్ధి కల్పించేలా ఉండాలని
సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశించారన్నారు.
❇️నాలుగేళ్ల డిగ్రీ ఆనర్స్ లో 10 నెలల అప్రెంటీస్ షిప్ తో పాటు ఏడాది పాటు
ఉపాధి కల్పన, నైపుణ్యాభివృద్ధి శిక్షణివ్వనున్నామన్నారు.
❇️మూడేళ్ల డిగ్రీలో కూడా 10 నెలల అప్రెంటీస్ షిప్ ఉంటుందన్నారు. ప్రవేశాల
సమయంలోనే సాధారణ డిగ్రీనా... ఆనర్స్ డిగ్రీ కావాలా..?అనేదానిపై విద్యార్థుల
ఐచ్ఛికాన్ని తీసుకుంటామన్నారు. డిగ్రీతో పాటు బీటెక్ ఆనర్స్ కూడా
ప్రవేశపెడుతున్నామన్నారు.
🍁అక్టోబర్ 15 నుంచి కళాశాలలు ప్రారంభం...
❇️కొవిడ్-19 కారణంగా ఈ ఏడాది విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభమవుతోందని మంత్రి
ఆదిమూలపు సురేష్ తెలిపారు. అక్టోబర్ 15 నుంచి కళాశాలలు ప్రారంభించాలని,
సెప్టెంబర్ లో ఉమ్మడి ప్రవేశ పరీక్షలు నిర్వహించాలని సీఎం జగన్ ఆదేశించారన్నారు.
ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలో ఆన్ లైన్ ద్వారా ప్రవేశాలు చేపడుతున్నామన్నారు. తమ
ప్రభుత్వం విద్యా రంగంపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. కళాశాలల్లో నాడు-నేడు
పథకం ప్రారంభించనున్నామని, ఆ పథకం కింద మౌలిక వసతులను కల్పించనున్నామని మంత్రి
వెల్లడించారు. అక్రమాలకు పాల్పడే ప్రైవేటు కళాశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని
సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశించారని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.
Taken From : News Channels