ట్రిపుల్ ఐటీలకు ప్రవేశ పరీక్ష
పది పరీక్షల రద్దు నేపథ్యంలో
నిర్ణయం
రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జి టెక్నాలజీ్‌స(ఆర్‌జీయూకేటీ) ఆధ్వర్యంలో
రాష్ట్రంలో నడుస్తోన్న నాలుగు ట్రిపుల్ ఐటీల్లో అడ్మిషన్ల కోసం ఎంట్రెన్స్
టెస్ట్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గణితం, సైన్స్ సబ్జెక్టుల్లో 3
గంటలపాటు పరీక్ష నిర్వహించాలని సంకల్పించింది. ఆబ్జెక్టివ్ టైపులో ప్రశ్నలు
ఇస్తారు. నవంబరులో పరీక్ష జరిగే అవకాశం ఉంది. పరీక్ష ఆఫ్‌లైన్‌లో జరుగుతుంది.
ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను వారం రోజుల్లో విడుదల చేయనున్నారు.
ఆర్‌జీయూకేటీ చట్టం ప్రకారం పదో తరగతి మార్కులు/గ్రేడ్ల మెరిట్ ఆధారంగా
ట్రిపుల్ ఐటీల్లో అడ్మిషన్లు చేపట్టాల్సి ఉంది. గ్రామీణ ప్రాంతాలు, ప్రభుత్వ రంగ
పాఠశాలల విద్యార్థులకు మెరుగైన సాంకేతిక విద్యను అందించేందుకు వీలుగా 2008 నుంచి
ఇదే విధానాన్ని అమలు చేస్తున్నారు. అయితే, కొవిడ్-19 నేపథ్యంలో ఈ ఏడాది పదో
తరగతి పరీక్షలు రద్దు చేయడం, విద్యార్థులకు మార్కులు, గ్రేడ్లు ఇవ్వకపోవడంతో
ట్రిపుల్ ఐటీల్లో అడ్మిషన్లకు ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహించడమే మేలన్న
అభిప్రాయానికి ఆర్‌జీయూకేటీ వచ్చింది. ఇందుకోసం వర్సిటీ చట్టానికి సవరణలు చేయాలని
భావిస్తున్నారు. ఈ ఒక్కసారికి మాత్రమే ఎంట్రెన్స్ నిర్వహించనున్నారు.
తాజాగా గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించి ఆమోదముద్ర వేశారు. బుధవారం
స్ట్రీమ్‌లైనింగ్ కమిటీ సమావేశం నిర్వహించి ఎంట్రెన్స్‌పై నిర్ణయం తీసుకున్నారు.
ఈ సమావేశానికి మంత్రి ఆదిమూలపు సురేశ్ కూడా హాజరయ్యారు. రాష్ట్రంలోని నూజివీడు,
ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలుల్లో ట్రిపుల్ ఐటీలు ఉన్నాయి. ఒక్కో క్యాంప్‌సలో
1,000 సీట్లు ఉన్నాయి. నాన్‌లోకల్ విద్యార్థులకు 15 శాతం సీట్లు అందుబాటులో
ఉంటాయి.
Posted in: NEWS