Ticker

6/recent/ticker-posts

భారతదేశానికి చెందిన పురాతన చరిత్రలో చాలా ఆసక్తికరమైన లేదా అంతగా తెలియని కథలు ఏమిటి?

ప్రాచీన భారతదేశ చరిత్రలో గొప్ప రాజులు ఎవరని హైస్కూలు చదువుతున్న పిల్లలని అడిగి చూడండి. అక్బరు, షాజహాన్ అంటారు. ఇంకా పాతవారు ఎవరంటే చంద్ర గుప్తుడు, సముద్ర గుప్తుడు, అశోకుడు అంటారు. మహా ఐతే శ్రీ హర్షుడు అంటారు. అందరూ ఉత్తర భారత దేశం వారే. ఇంతా చేసి మనం స్వర్ణ యుగంగా చదువుకొనే గుప్త సామ్రాజ్యం బీహార్ కాక ఇప్పటి భారత దేశంలో ఇంకొన్ని రాష్ట్రాలను మించి ఉండదు. ఆ స్వర్ణయుగపు ఛాయలు ఇప్పుడెక్కడా కనిపించదు.

దాదాపు దక్షిణ భారత దేశమంతా, ఇంకా ఒరిస్సా, బెంగాల్, బాంగ్లాదేశ్, బర్మా, థాయిలాండ్, కాంబోడియా, వియత్నాం, లావోస్, శ్రీలంక, మాల్దీవులు, అండమాన్-నికోబార్ దీవులు, మలేషియా, సింగపూర్, ఇండోనేషియా, ఈ ప్రాంతాలన్నింటినీ జయించి ఏకఛత్రాధిపత్యంగా పాలించిన భారతీయ చక్రవర్తి ఎవరు అని అడిగి చూడండి. తెల్లమొహం వేస్తారు తొంభై శాతం మంది.

పై శిల్పంలో ఉన్నది (క్రింద, తలపాగ చుట్టించుకొంటున్న వ్యక్తి) భారత దేశ చరిత్రలోనే అతిపెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించి సర్వంసహాధిపత్యంగా ఏలిన మహా చక్రవర్తి, రాజేంద్ర చోళుడు. అరివీర భయంకరుడైన రాజరాజ చోళుని కొడుకు. తెలుగులో ఆదికావ్యాన్ని రచింపజేసిన వేంగీ చాళుక్య ప్రభువు రాజరాజ నరేంద్రునికి స్వయానా మేనమామ, తన కూతురినిచ్చిన మామగారు.

తంజావూరు రాజధానిగా పరిపాలించిన రాజరాజ చోళుని పెద్ద కొడుకుగా, యువరాజుగా ఉన్నప్పుడే అనేక యుద్ధాలు చేసి, తండ్రిని మించిన కొడుకని ప్రజల మెప్పు పొంది రాజై, కర్ణాటక, కేరళ, కోస్తా ఆంధ్ర, ఒరిస్సాల మీదుగా గంగా నదీ తీరం వరకు సామ్రాజ్యాన్ని విస్తరించి గంగా జలాన్ని పాత్రలతో నింపి తంజావూరుకు తీసుకొని వచ్చి 'గంగై కొండ చోళన్' (గంగను కైగొన్న చోళుడు) అన్న బిరుదు పొందాడు. తూర్పు ఆసియా దేశాలైన థాయిలాండ్, వియత్నాం, కంబోడియా, ఖ్మెర్ రాజ్యాలను జయించి తన సామంత రాజులుగా చేసుకొని కప్పం వసూలు చేశాడు. పది, పదకొండవ శతాబ్దాలలో యావత్ ప్రపంచంలో అతి పెద్ద సామ్రాజ్యం చోళులదే. ప్రపంచంలో అతి పెద్దదైన నౌకా సేన రాజేంద్ర చోళునిదే. శ్రీలంక మొదలుకొని నేటి ఇండోనేషియా వరకు ఉన్న అన్ని ద్వీప దేశాలను జయించి అక్కడ చోళుల వ్యాఘ్ర పతాకాన్ని ఎగుర వేశాడు. హిందూ మహా సముద్రం, బంగాళాఖాతంలలో తిరిగే ఏ వ్యాపార నౌక ఐనా ఆ రోజులలో చోళ రాజ్యానికి కప్పం కట్టవలసిందే. తమిళనాడులోని నాగపట్టినం ప్రపంచంలో అతి పెద్ద ఓడరేవు గా ఉండేది.

దేశంలో రెవెన్యూ రికార్డులను తయారుచేయడానికి ఆద్యుడు రాజేంద్ర చోళుడు. చోళ రాజ్యంలోని ప్రతి చదరపు సెంటీమీటరు భూమి కూడా కొలిచి రికార్డు చేయబడి ఉండేదని ప్రతీతి. కుల, మత ప్రసక్తి లేకుండా ఒకరినొకరు ఇష్టపడిన యువతీ యువకులు ఎవరైనా తన రాజ్యంలో స్వేచ్ఛగా వివాహం చేసుకోవచ్చని శాసనం చేసిన సంస్కర్త. మైళ్ళ కొలది వ్యాసార్థం కల చెరువులను త్రవ్వించి దేశాన్ని సుభిక్షంగా చేసిన నేత. పెరుగుతున్న రాజ్య గౌరవానికి తగ్గట్లు 'గంగైకొండ చోళ పురం' అన్న పేరుతో ఒక క్రొత్త రాజధానిని నిర్మించిన భవిష్యదర్శి.

ఐతే మన పాఠశాలల చరిత్ర పుస్తకాల్లో ఈ చక్రవర్తి ప్రసక్తి ఉండదు. ఒకవేళ ఉన్నా మొక్కుబడిగా ఒకటి రెండు పేరాలు ఉంటాయి.